`ఎవరు`ద‌ర్శ‌కుడి మెగా మ‌ల్టీస్టార‌ర్

దిల్‌రాజు మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్ధం చేశాడా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఈసారి ఆయ‌న మెగా కథానాయ‌కుల్ని క‌లిపి సినిమా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అందుకోసం ఎవ‌రు ద‌ర్శ‌కుడు రామ్‌జీ ఇప్ప‌టికే క‌థ‌ని కూడా సిద్ధం చేసిన‌ట్టు తెలిసింది. దిల్‌రాజుకి ఆ క‌థ న‌చ్చ‌డంతో దానిపై దృష్టిపెట్టిన‌ట్టు స‌మాచారం.

అందులో వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించ‌బోతున్నారు. దిల్‌రాజులాంటి నిర్మాత క‌థ సిద్ధం చేయించాక ఈ హీరోలు కాద‌నే ఆస్కారం లేదు. పైగా వీళ్ల‌కి క‌లిసి న‌టించాల‌నే కోరిక ఎప్ప‌ట్నుంచో ఉంది. ఈ బావాబావ‌మ‌రుదులు ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా మేమిద్ద‌రం క‌లిసి సినిమా చేస్తామ‌ని, దాని గురించి మా మ‌ధ్య చ‌ర్చ కూడా జ‌రుగుతుంటుంద‌ని చెబుతుంటారు. ప్ర‌స్తుతానికి ఇద్ద‌రూ వాళ్ల వాళ్ల సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇద్ద‌రికీ తీరిక దొరికినప్పుడు ఈ మ‌ల్టీస్టార‌ర్ ప‌ట్టాలెక్క‌డం ఖాయం.