ద‌స‌రా అంతా రాజుగారిదే..!

ఒక‌ప్పుడు తెలుగులో నిర్మాత అంటే రూల‌ర్. ఆయ‌న చెప్పిందే వేదం. అందుకే తెలుగులో రామానాయుడు.. అల్లుఅర‌వింద్.. అశ్వినీద‌త్ లాంటి నిర్మాత‌లు ఇంత‌కాలం ఇండ‌స్ట్రీలో ఉన్నారు. గొప్ప నిర్మాత‌లుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు నిర్మాత అంటే ఓ క్యాషియ‌ర్ మాత్ర‌మే. హీరో ద‌ర్శ‌కుడు ముందుంటే.. వెన‌క నుంచి అవ‌స‌ర‌మైన‌పుడు డ‌బ్బులిచ్చే ఓ ఏటిఎం అయిపోయాడు నిర్మాత‌. క‌థ‌పై అవ‌గాహ‌న లేకుండా.. కేవ‌లం డ‌బ్బులున్నాయి క‌దా అని సినిమా రంగంలోకి వ‌స్తోన్న కొంద‌రు కొత్త నిర్మాత‌లు.. ఒక్క సినిమా పోయేస‌రికి చేతులెత్తేస్తున్నారు. కానీ ఇలాంటి టైమ్ లో కూడా రెగ్యుల‌ర్ గా సినిమాలు చేస్తూ.. అవి కూడా మంచి సినిమాలు చేస్తూ.. వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకుంటున్నాడు దిల్ రాజు. అస‌లు ఈయ‌న కాన్ఫిడెన్స్ ఏంటో.. క‌థ‌ల‌పై ఈయ‌నకు ఉన్న క‌మాండ్ ఏంటో తెలియ‌క చాలా మంది నిర్మాత‌లు జుట్టు పీక్కుంటున్నారు. ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుల‌కి కూడా ఛాన్సిచ్చి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్నాడు దిల్ రాజు.

ఈ ఏడాది ఇప్ప‌టికే శ‌త‌మానం భ‌వ‌తి.. నేనులోక‌ల్.. ఫిదా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టాడు దిల్ రాజు. డిజే కూడా ఓకే అనిపించింది. ఇంకా ఈ ఏడాది రాజా ది గ్రేట్.. ఎంసిఏ సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు డిస్ట్రిబ్యూట‌ర్ గానూ స‌త్తా చూపిస్తున్నాడు దిల్ రాజు. ముఖ్యంగా ఈ ద‌స‌రా పండ‌గ అంతా రాజుగారిదే. మొన్నొచ్చిన జై ల‌వ‌కుశ‌.. రేపు రాబోయే స్పైడ‌ర్.. మ‌హానుభావుడు సినిమాల‌ను తెలంగాణ‌లో విడుద‌ల చేయ‌బోయేది దిల్ రాజే. ఒక్క‌రే ఇన్ని సినిమాలు తీసుకోవడ‌మే ఓ సంచ‌ల‌నం అయితే.. అన్నింటికీ థియేట‌ర్స్ మేనేజ్ చేయ‌గ‌ల‌గ‌డం మ‌రో చిత్రం. ఇది కేవ‌లం దిల్ రాజు త‌ప్ప మ‌రెవ్వ‌రూ చేయ‌లేని మాయ‌. పైగా స్టార్స్ అంద‌రితోనూ ఈయ‌న‌కు ఉన్న రిలేష‌న్ కూడా వ‌ర‌స‌గా సినిమాలు కొనే క్ర‌మానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. డిస్ట్రిబ్యూట‌ర్ గానూ దిల్ రాజు టైమ్ న‌డుస్తుందిప్పుడు. నైజాంలో జై ల‌వ‌కుశ 4 రోజుల్లోనే 12 కోట్ల షేర్ తెచ్చింది. ఇక స్పైడ‌ర్.. మహానుభావుడు కూడా ఆడితే 2017 దిల్ రాజు నామ సంవ‌త్స‌రంగా మారిపోతుంది.