దిల్ రాజు టైం బాలేదు

ఇప్పుడు దిల్ రాజుకు ఏమైంది..? ఆయ‌న నిర్మించిన సినిమాల‌న్నీ వ‌ర‌స‌గా విజ‌యం సాధిస్తున్నాయి క‌దా.. ఇప్పుడు వ‌చ్చిన క‌ష్టం ఏంటి అనుకుంటున్నారా..? నిజ‌మే నిర్మాత‌గా ఆయన‌కు ఇప్పుడు తిరుగులేదు. కానీ డిస్ట్రిబ్యూట‌ర్ గా మాత్రం రాజుగారి లెక్క‌లు త‌ప్పుతున్నాయి. ఈయ‌న కొన్న కొన్ని పెద్ద సినిమాలు అడ్డంగా మునిగిపోతున్నాయి.. ఆయ‌న్ని కూడా ముంచేస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న న‌మ్మి తీసుకున్న కొన్ని సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. గ‌తేడాది ఈయ‌న తీసుకున్న స్పైడ‌ర్ నైజాంలో నిండా ముంచేసింది. 23 కోట్ల‌కు ఈ సినిమాను కొంటే.. వ‌చ్చింది మాత్రం 10 కోట్ల లోపే. ఇంకా చెప్పాలంటే 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. ఇక జై ల‌వ‌కుశ కూడా 18 కోట్ల‌కు కొంటే.. 17 కోట్ల ద‌గ్గ‌రే ఆగింది ప్ర‌యాణం. అయితే ఈ చిత్రంతో ఆయ‌న‌కు పెద్ద‌గా వ‌చ్చిన న‌ష్ట‌మైతే ఏం లేదు..! ఇక జ‌వాన్ సినిమాకు అన్నీ ఆయ‌నే అయి నైజాంలో విడుద‌ల చేసాడు. 5 కోట్ల‌కు పైగా రేట్ ప‌డితే వ‌చ్చింది మాత్రం 3 కోట్లే.

ఇవ‌న్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు వ‌చ్చిన సినిమా మాత్రం రాజుగారిని ఎంత ముంచేస్తుంద‌నే లెక్క కూడా ఊహకు అంద‌డం లేదు. అదే అజ్ఞాత‌వాసి. ఈయ‌న ఈ చిత్రాన్ని ఏకంగా 29 కోట్ల‌కు కొన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క బాహుబ‌లి త‌ప్పితే ఏ సినిమాను ఇంత రేట్ పెట్ట‌లేదు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ పై న‌మ్మ‌కంతో అంత పెట్టాడు దిల్ రాజు. ఇప్పుడు ఈ చిత్రం తొలిరోజు రికార్డ్ స్థాయిలో 6 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. కానీ లాంగ్ ర‌న్ లో అజ్ఞాత‌వాసి ఎంత వ‌సూలు చేస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తి రేకెత్తిస్తుంది. ఓ వైపు సినిమాకు డిజాస్ట‌ర్ టాక్ వ‌చ్చేసింది. దానికితోడు జై సింహా.. గ్యాంగ్.. లాంటి సినిమాలు వ‌స్తున్నాయి. అన్నింటికీ మించి సంక్రాంతికి ఆంధ్రా వాళ్ళంతా అక్క‌డి ఊళ్ల‌కు వెళ్లిపోతారు. ఇలాంటి టైమ్ లో తెలంగాణ‌లో వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డం ఖాయం. ఇలా ఎన్నో అనుమానాల మ‌ధ్య ర‌న్ అవుతుంది అజ్ఞాత‌వాసి. ఈ సినిమాతో దిల్ రాజు జాత‌కం ఎలా ట‌ర్న్ కానుందో మ‌రికొన్ని రోజుల్లో తేలిపోతుంది.

User Comments