అనిల్ రావిపూడి ది గ్రేట్

ఇప్పుడు ఇండ‌స్ట్రీ మొత్తం అంటోన్న మాట ఇదే. హీరో క్యారెక్ట‌ర్ ను అంధుడిగా పెట్టి సినిమా చేయ‌డం.. దాన్ని మెప్పించేలా చేయ‌డం అనేది మామూలు విష‌యం కాదు. కానీ ఇప్పుడు రెండే సినిమాల అనుభ‌వం ఉన్న అనిల్ రావిపూడి చేసి చూపించాడు. ర‌వితేజ లాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరోతో రాజా ది గ్రేట్ చేసి.. ఔరా అనిపించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వ‌స్తున్నాయి. రొటీన్ క‌థే అని పెద‌వి విరుస్తున్నా.. ఎంట‌ర్ టైన్మెంట్ తో కొట్టేసాడు అనిల్ రావిపూడి. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా చ‌క్క‌టి స్క్రీన్ ప్లే రాసుకున్నాడు అనిల్. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో రాజేంద్రప్ర‌సాద్, అన్న‌పూర్ణ మ‌ధ్య వ‌చ్చే కామెడీ సీన్స్ జంధ్యాల సినిమాల‌ను గుర్తు చేస్తాయి. సుప్రీమ్ లో కాఫీ త‌ర‌హా ఎపిసోడ్ ఇది.

ఇక సెకండాఫ్ లో వ‌చ్చే గున్నామామిడి పాట అయితే థియేట‌ర్స్ ను ఊపేస్తుంది. కామెడీ స‌న్నివేశాలు రాసుకోవ‌డంలో అనిల్ ఆరితేరిపోయాడు. ప‌ర‌మ రొటీన్ క‌థ‌ను కూడా ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ఈ ద‌ర్శ‌కుడు సిద్ధ‌హ‌స్తుడు. ప‌టాస్, సుప్రీమ్ ల‌లో ఇది చూసాం. ఇప్పుడు రాజా ది గ్రేట్ తో మ‌రోసారి ప్రూవ్ చేసాడు. తెలుగులో ఇప్పుడు కామెడీని అద్భుతంగా డీల్ చేసే ద‌ర్శ‌కులు చాలా త‌క్కువ‌. ఒక‌ప్పుడు జంధ్యాల‌, ఇవివి లాంటి ద‌ర్శ‌కులు ఉండేవారు. ఇప్పుడు ఆ కోటా భ‌ర్తి చేయ‌డానికి తాను ఉన్నానంటున్నాడు అనిల్ రావిపూడి. ఇదే ఊపులో మ‌రో రెండు హిట్లు ప‌డితే ఈ కుర్రాడిని ఆప‌డం క‌ష్ట‌మే.