యంగ్ హీరోలతో హరీష్ శంకర్ దాగుడు మూతలు

టాలీవుడ్ లో టాలెంటెడ్ రైటర్ కమ్ డైరెక్టర్ గా పేరున్న హరీష్ శంకర్ రీసెంట్ గా ‘డీజే – దువ్వాడ జగన్నాథమ్’ తో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పుణ్యమా అని హరీష్ ఇటు మీడియాలోనూ, అటు జనాల దృష్టిలోనూ అతి చేస్తున్నాడనే ఫీలింగ్ కలిగించినట్లే అయింది. దీంతో ఇలా అయితే హరీష్ ముందుముందు ఎలా అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. కానీ, అవేమీ పట్టించుకోని హరీష్ ఇప్పుడు డీజే నుంచి బయటకొచ్చి తన కొత్త సినిమాకు రంగం సిద్ధం చేసేయడం విశేషం.
ఈ మేరకు తాజాగా తన కొత్త సినిమాకు ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ ఫిక్స్ చేయడమే కాకుండా.. ఈ సినిమా లొకేషన్స్ కోసం యూఎస్ఏ వెళ్లి అక్కడ పనులు కూడా పూర్తి చేసుకుని అప్పుడే తిరిగి వచ్చేశాడట. అంతేకాకుండా ఈ దాగుడు మూతలు కథను అప్పుడే దిల్ రాజుకు వినిపించడం.. ఆయన తనకు బాగా నచ్చిందని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఇదే విశేషం అనుకుంటే, ఇప్పుడు ఈ దాగుడు మూతలు ఓ మల్టీస్టారర్ గా తెరకెక్కబోతుందని.. దీనికోసం ఇద్దరు యంగ్ హీరోలను ఎలాగైనా సెట్ చేయాలని హరీష్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ బయటకు రావడం గమనార్హం. ఇక ఆ యంగ్ హీరోలు టాలీవుడ్ టాలెంటెడ్ కుర్రాళ్ళు.. నాని, శర్వానంద్ కావడమే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ గా మారింది.
ఓవైపు నాని MCA సినిమాతో బిజీగా ఉంటే, శర్వానంద్ మహానుభావుడు సినిమాతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. అలాగే నాని తర్వాత వరుసగా కొన్ని ప్రాజెక్టులు కమిట్ అయి ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ శంకర్ తో వీళ్ళు దాగుడు మూతలు ఆడతారా? అంటే.. చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే అక్కడున్నది హరీష్ శంకర్ కాబట్టి. అందులోనూ ఈ దాగుడు మూతలు కథలో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం.. వెనకాల ఎలాగూ దిల్ రాజు కూడా ఉండటంతో.. ప్రాజెక్ట్ ఓకే అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం.. విమర్శలతో హడావుడి చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు కూల్ గా నాని – శర్వానంద్ లాంటి టాలెంటెడ్ హీరోలతో దాగుడు మూతలు ఆడతాడేమో.