డైరెక్టర్ క్రిష్ ని బెదిరిస్తున్న బ్రాహ్మణులు

Last Updated on by

బాలీవుడ్ లో కొంద‌రు చ‌రిత్ర‌కారుల‌కు ఏం ప‌నిపాట లేన‌ట్లుంది. ఎవ‌రు ఏం సినిమా చేస్తున్నారా.. అందులో ఏం త‌ప్పులు వెతుకుదామా అనేది మాత్రమే ఇప్పుడు వాళ్ల‌కు తెలిసింది. అస‌లు సినిమా ఏం చేస్తున్నారో.. తీస్తున్నారో తెలియ‌దు. ఎలా వ‌స్తుందో అస‌లే క్లారిటీ లేదు. కానీ వాళ్లు ఆ సినిమాకు అడ్డు ప‌డిపోవాలి. అది ఫ్యాష‌న్ అయిపోయిందిప్పుడు. మొన్న‌టికి మొన్న ప‌ద్మావ‌తికి క‌ర్ణిసేన నుంచి ఎన్ని తిప్ప‌లు వ‌చ్చాయో చెప్పాల్సిన ప‌నిలేదు. తీరా సినిమా విడుద‌లైన త‌ర్వాత ఏం లేద‌ని వ‌దిలేసారు. ఇప్పుడు ప‌ద్మావ‌తి అయిపోయింది.. మ‌ణిక‌ర్ణిక‌పై చ‌రిత్ర కారుల క‌న్ను ప‌డింది.

ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అప్పుడే చ‌రిత్ర వ‌క్రీక‌రిస్తున్నారంటూ ర‌చ్చ మొద‌లైంది. రాజ‌స్థాన్ స‌ర్వ బ్రాహ్మ‌ణ్ మ‌హాస‌భ మ‌ణిక‌ర్ణిక సినిమాపై క‌న్నెర్ర జేస్తుంది. ఈ చిత్రంలో ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ కు ఓ బ్రిటీష్ వ్య‌క్తితో ప్రేమ ఉన్న‌ట్లు త‌ప్పుగా చూపిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంద‌ని.. అలా జ‌రిగితే మాత్రం క‌చ్చితంగా సినిమాను విడుద‌ల కానివ్వ‌మంటూ హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నాయి. దీనిపై క్రిష్ ఎలా స్పందించాలో కూడా తెలియ‌డం లేదంటున్నాడు. అస‌లు మేమేం తీస్తున్నామో తెలియ‌కుండా ఎందుకంత ఆత్రం అంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న గ‌త సినిమా శాత‌క‌ర్ణి విష‌యంలోనూ ఇదే చేసారు చ‌రిత్ర తెలుసు అనుకున్న కారులు.

ఇప్పుడు మ‌ణిక‌ర్ణిక‌పై వాళ్ల క‌ళ్లు ప‌డ్డాయి. కంగ‌న ర‌నౌత్ ఈ చిత్రంలో ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ గా న‌టిస్తుంది. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించిన వార‌ణాసి గ‌డ్డ‌పైనే మ‌ణిక‌ర్ణిక షూటింగ్ మొద‌లు పెట్టాడు క్రిష్. 1828లో కాశీలోనే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జ‌న్మించింది. ఆమె జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. బాహుబ‌లి పుణ్య‌మా అని ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో కూడా ఇప్పుడు తెలుగు టెక్నీషియ‌న్లు అంటే గౌర‌వం పెరిగిపోయింది. కంగ‌న ర‌నౌత్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌ణిక‌ర్ణిక కోసం బాలీవుడ్ లో అంత‌మంది ద‌ర్శ‌కుల‌ను వ‌దిలేసి మ‌న క్రిష్ ను ఎంచుకుంది.

ఈ సినిమాకు మ‌రో తెలుగు వాడు కూడా ప‌ని చేస్తున్నాడు అత‌డే రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్. మ‌ణిక‌ర్ణిక సినిమాకు క‌థ అందించింది ఆయ‌నే. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ జీవితాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ మ‌ధ్య విడుద‌లైన‌ ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్ట‌ర్ కు రెస్పాన్స్ అదిరి పోయింది. ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ గుర్రంపై ఉంటూ శ‌త్రువుల‌ను చీల్చి చెండాడుతున్న ఈ ఫోటో అదిరిపోయిందంతే. 2018 ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కానీ హిట్టైతే క్రిష్ ను బాలీవుడ్ హీరోలు వ‌ద‌ల‌రు. చ‌రిత్ర‌లు చేతికిచ్చి సినిమాలు చేయ్ అంటూ అక్క‌డే క‌ట్టేసుకుంటారేమో..?

User Comments