నాని.. శ‌ర్వా … క‌రోనా సినిమా

క‌రెంట్ టాపిక్స్ మీద సినిమాలు చేయ‌డంలో మ‌న ద‌ర్శ‌కులు ముందుంటారు. జ‌నాల నోళ్ల‌లో బాగా నానుతున్న అంశాన్ని ఎంచుకుని సినిమా తీస్తే దానికి వ‌చ్చే ప‌బ్లిసిటీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుంది. స‌క్సెస్ కావ‌డానికి ఎక్కువ అవ‌కాశాలే ఉంటాయి. రామ్‌గోపాల్ వ‌ర్మ ఆ విష‌యంలో అంద‌రికంటే ఒక అడుగు ముందే ఉంటారు. ఆయ‌న సినిమాలు దాదాపుగా క‌రెంట్ ఎఫైర్స్‌మీదే ఉంటాయి. మిగ‌తా ద‌ర్శ‌కులు ఆ నేప‌థ్యంలో క‌థ‌లు రాసుకోకపోయినా… సినిమాలో ఏదో ఒక సంద‌ర్భంలో క‌రెంట్ టాపిక్స్‌ని బాగా వాడుకుంటూ వినోదం పండిస్తుంటారు. తాజాగా ఏ ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు క‌లిసినా అందులో ప్ర‌ధాన టాపిక్‌గా ప్ర‌స్తావ‌న‌కొచ్చే క‌రోనా గురించి కూడా ద‌ర్శ‌కులు సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కు చాలా మంది ద‌ర్శ‌కులు ఇప్ప‌టికే క‌రోనా పేరుతో టైటిల్స్ రిజిస్ట‌ర్ చేయించారు. ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు మారుతికి కూడా క‌రోనాపై ప్ర‌శ్న ఎదురైంది. క‌రోనా గురించి క‌థ‌లేమైనా ఊహిస్తున్నారా అని ఆయ‌న్ని అడిగితే… ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్` సినిమాలోని మ‌తి మ‌రుపు నానినీ, `మ‌హానుభావుడు` సినిమాలో అతి శుభ్ర‌త‌తో వ్య‌వ‌హ‌రించే హీరో శ‌ర్వానంద్‌నీ క‌లిపి క‌రోనా కాలంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచ‌న వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు మారుతి. ఆ నేప‌థ్యంలో మ‌రింత ఫ‌న్ పండించొచ్చ‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. నిజంగా ఈ ఐడియా భ‌లే ఉంది క‌దా. మ‌రి మారుతి ఆలోచ‌న క‌థ‌గా రూపాంతరం చెందుతుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. అయితే క‌రోనావ‌ల్ల మారుతి తీసిన `మ‌హానుభావుడు` సినిమా మాత్రం బాగా చ‌ర్చ‌కొచ్చింది. అందులో హీరో అతి శుభ్ర‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. ఇప్పుడున్న సిచువేష‌న్స్‌లో అంద‌రూ అలా ఉండాల్సిందే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా విడుద‌ల‌య్యాక ఇన్నాళ్ల‌కి దాని గురించి మ‌రోసారి ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవ‌డం, టీవీల్లో ప‌దే ప‌దే వేయ‌డం గ‌మ‌నార్హం.