మెహ‌బూబా.. మోత మొద‌లైంద‌బ్బా..!

రోజూ ప‌ప్ప‌న్న‌మే తింటే బోర్ వ‌చ్చేస్తుంది. కొన్ని రోజుల‌కు తినాల‌ని కూడా అనిపించ‌దు. ఇప్పుడు పూరీ జగ‌న్నాథ్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. కాక‌పోతే ఇక్క‌డ తిండి విష‌యం కాదు. సినిమాల విషయం. మ‌నోడు ఒకేర‌కం సినిమాలు చేసి చేసి చివ‌రికి ఇప్పుడు మారాడు. కొడుకు కోసం కొత్త‌గా ట్రై చేస్తున్నాడు. మెహ‌బూబా సినిమాతో చాలా రోజుల త‌ర్వాత మ‌రోసారి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. ఇండో పాక్ క‌థ‌గా ఇది రూపొందుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ చూస్తుంటేనే సినిమా ఎలా ఉండ‌బోతుందో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. స‌మ్మ‌ర్ లో విడుదల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్ ఇప్ప‌ట్నుంచే మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే మెహ‌బూబా షూటింగ్ పూర్త‌యింది. పంజాబ్, ల‌డ‌క్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లాంటి ప్ర‌దేశాల్లో ఈ సినిమాను తెర‌కెక్కించాడు పూరీ. హైద‌రాబాద్ లో కూడా చాలా భాగం షూటింగ్ చేసాడు.

ఓ కాలేజ్ కు వెళ్లి అక్క‌డే సినిమా ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసాడు పూరీ. అత‌డితో పాటు ఛార్మి కూడా ఉంది ఈ లిస్ట్ లో. అస‌లు ఈ సినిమా ప్ర‌మోషన్ ను మొత్తం నెత్తిన వేసుకుందే ఛార్మి అని తెలుస్తుంది. మెహ‌బూబా పూరీ కెరీర్ తో పాటు త‌న‌యుడి కెరీర్ కు కూడా కీల‌కం. ఈయ‌న కెరీర్ కు హిట్ కావాలి.. త‌న‌యుడి కెరీర్ కు మంచి బ్రేక్ రావాలి. దాంతో మ‌న‌సు పెడుతున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. పైగా ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయ‌నే. చాలా కాలం త‌ర్వాత సందీప్ చౌతాతో క‌లిసి ప‌ని చేసాడు పూరీ జ‌గ‌న్నాథ్. త్వ‌ర‌లోనే పాట‌లు విడుద‌ల కానున్నాయి. అప్పుడెప్పుడో కెరీర్ కొత్త‌లో ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌మ‌ణ్యం.. ఇడియ‌ట్.. శివ‌మ‌ణి.. అమ్మా నాన్న ఓ త‌మిళ అమ్మాయి లాంటి సినిమాల్లో పూరీ ప్రేమ‌క‌థ‌లు అదిరిపోయాయి. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు 1971 ఇండోపాక్ వార్ నేప‌థ్యంలో న‌డిచే ఓ ప్రేమ‌క‌థ‌ను తీసుకొస్తున్నాడు పూరీ.

టీజ‌ర్లో ఆకాష్ ను పెద్ద‌గా చూపించ‌లేదు పూరీ. అంతా లొకేష‌న్స్ పైనే దృష్టి పెట్టాడు. ఇందులో హీరోయిన్ గా నేహాశెట్టి న‌టిస్తోంది. ఆమె పాక్ అమ్మాయిగా న‌టిస్తుంది. ఇండియ‌న్ అబ్బాయి.. పాక్ అమ్మాయి మ‌ధ్య ప్రేమ‌క‌థ అనేదే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ పాయింట్.. అందులోనూ 1971 వార్ అనేది ఇంకా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఈ రెండింటి మ‌ధ్య‌లో పూరీ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో..? స‌మ్మ‌ర్ లో విడుద‌లకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. మ‌రి ఇత‌ర వార‌సుల‌కు మంచి లాంఛింగ్ ఇచ్చిన పూరీ.. మెహ‌బూబాతో త‌న వార‌సుడికి అలాంటి లాంఛింగ్ ఇవ్వాలనుకొంటున్నాడు పూరీ.