చిక్కుల్లో ప‌డ్డ ఆ న‌లుగురు

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక‌ప్పుడు వాళ్లు అగ్ర ద‌ర్శ‌కులు. వాళ్ళు ఎస్ అంటే నో అని చెప్పే ధైర్యం స్టార్ హీరోల‌కు కూడా ఉండేది కాదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా.. అందుకే ఇప్పుడు వాళ్ల టైమ్ ట‌ర్న్ అయింది. అగ్ర ద‌ర్శ‌కులు కాస్తా ఫ్లాప్ ద‌ర్శ‌కులు అయ్యారు. దాంతో సీన్ రివ‌ర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు ఆ న‌లుగురు. వాళ్లే వినాయ‌క్.. త్రివిక్ర‌మ్.. శీనువైట్ల‌.. పూరీ జ‌గ‌న్నాథ్. న‌లుగురు ట్రెండ్ సెట్టింగ్ ద‌ర్శ‌కులే. కానీ ఇప్పుడు అంద‌రికీ కామ‌న్ గా టైమ్ బాగోలేదు. కెరీర్ లో అప్ప‌టి వ‌ర‌కు డిజాస్ట‌ర్ అంటే ఏంటో తెలియ‌ని త్రివిక్ర‌మ్ కు తొలిసారి షాకిచ్చాడు అజ్ఞాత‌వాసి. ఈ చిత్రం త‌ర్వాత త‌న‌ను తాను నిరూపించుకునే ప‌నిలో ప‌డ్డాడు మాట‌ల మాంత్రికుడు. దానికోసం ఎన్టీఆర్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వని వాడుకుంటున్నాడు. అక్టోబ‌ర్ లో విడుద‌ల కానుంది ఈ చిత్రం.

ఇక వినాయ‌క్ కూడా అంతే. వ‌ర‌స విజ‌యాల‌తో ఒక‌ప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈ మ‌ధ్యే వ‌చ్చిన ఇంటిలిజెంట్ దారుణంగా బోల్తా కొట్ట‌డంతో ఇప్పుడు వినాయ‌క్ తో సినిమా అంటే స్టార్స్ భ‌య‌ప‌డుతున్నారు. కానీ ఈ స‌మ‌యంలోనూ ఆయ‌న్ని న‌మ్మి బాల‌య్య సినిమా ఇచ్చాడు. మే 27న మొద‌లు కానుంది ఈ చిత్రం. సి క‌ళ్యాణ్ నిర్మాత‌. ఇది వినాయ‌క్ కెరీర్ కు నిర్ణ‌యాత్మ‌కంగా మారింది. వినాయ‌క్ ఇలా ఉంటే పూరీ ప‌రిస్థితి మ‌రోలా ఉంది. ఈయ‌న‌కు హిట్ వ‌చ్చి చాలా ఏళ్లైపోయింది. 2012లో వ‌చ్చిన బిజినెస్ మ్యాన్ హిట్.. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ యావ‌రేజ్.

గ‌త ప‌దేళ్ల‌లో పూరీ కెరీర్ ఇదే. కొడుకుతో చేసిన మెహ‌బూబా కూడా డిజాస్ట‌రే. అయినా కూడా అధైర్య‌ప‌డ‌కుండా మ‌ళ్లీ త‌న‌యుడితోనే ఇంకో సినిమాకు సిద్ధ‌మ‌య్యాడు పూరీ. శీనువైట్ల కూడా ఇప్పుడు ఉనికి కోసం పాటు ప‌డుతున్నాడు. ఈయ‌న గ‌త మూడు సినిమాలు ఆగ‌డు.. బ్రూస్లీ.. మిస్ట‌ర్ ఒక‌టి మించి మ‌రోటి ఫ్లాప్ అయ్యాయి. మిస్ట‌ర్ తో వైట్ల‌పై ఉన్న ఆ కాస్త న‌మ్మ‌కం కూడా అంద‌రికీ పోయింది. ఏడాది పాటు వేచి చూసి చూసి ఈ మ‌ధ్యే ర‌వితేజ హీరోగా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ మొద‌లు పెట్టాడు. ఈ చిత్ర‌మే ఇప్పుడు శీనువైట్ల కెరీర్ ను ముంచినా తేల్చినా..! అమెరికాలోనే ఎక్కువ షూటింగ్ జ‌రుగుతుంది. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శృతిహాస‌న్, ఇలియానా హీరోయిన్లుగా న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది. మొత్తానికి ఈ న‌లుగురు ద‌ర్శ కుల‌కు ఇప్పుడు ఈ నాలుగు సినిమాలు అగ్నిపరీక్షే.

User Comments