డైరెక్టర్ ను సూపర్ గా వాడేస్తోన్న దర్శకుడు..!

టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఈరోజుల్లో సినిమాను ఎలా ప్రమోట్ చేశామనే దానిపైనే ఓపెనింగ్స్ మరియు రిజల్ట్ ఆధారపడి ఉంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఇప్పుడు కంటెంట్ ఎంత కీలకమో ప్రమోషన్స్ క్రియేటివ్ గా ఉండటం కూడా అంతే అవసరం అవుతుంది. ఈ విషయంలో ఇప్పుడు మన టాలీవుడ్ లో రిలీజ్ కు రెడీ అయిన ‘దర్శకుడు’ సినిమాను మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే. ప్రధానంగా మన క్రియేటివ్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ వెనకాల ఉండటమే కారణమేమో గాని, ప్రస్తుతం ప్రమోషన్స్ విషయంలో దర్శకుడు చూపిస్తున్న దూకుడు మాత్రం సూపరో సూపర్ అనిపిస్తోంది.

అందులోనూ తాజాగా ఈ ‘దర్శకుడు’ మూవీ ప్రమోషన్స్ కోసం టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ను వాడేస్తోన్న విధానం అయితే వావ్ అనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళితే, తాజాగా దర్శకుడు మూవీ యూనిట్ టీజర్ లాంటి చిన్న ప్రమోషనల్ వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఆ వీడియోలో హీరో హీరోయిన్ ట్రైన్ లో వెళ్తుండగా.. ‘సినిమాల్లేకుండా ఎంటర్టైన్మెంట్ లేదు, ఎగ్జైట్మెంట్ లేదు’ అంటూ హీరో డైలాగ్ చెబితే, దానికి హీరోయిన్ స్పందిస్తూ.. ‘హీరో ఒక్కడే వంద మందిని కొట్టడం, హీరో హీరోయిన్ పల్లెటూరిలో ప్రేమించుకుని ఫారిన్లో సాంగేసుకోవడం, మోస్ట్ అన్ నేచురల్’ అంటూ కామెంట్ చేస్తోంది. దీంతో చిత్ర యూనిట్ సినిమాలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ల నుంచి స్ఫూర్తి పొందిన సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పే ప్రయత్నం చేసింది.

దీనికోసం యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మను దింపడం విశేషం. ఈ నేపథ్యంలో హీరోయిన్ కామెంట్ తర్వాత సుధీర్ వర్మ మాట్లాడుతూ.. తన దోచేయ్ సినిమాలో హీరోయిన్ సిగరెట్ తాగే సీన్ రియల్ లైఫ్ లో నుంచే తీసుకున్నానని, నా ఫ్రెండ్ ఒకమ్మాయి అలాగే సిగరెట్ తాగేదని, తను సిగరెట్లు తెచ్చుకోకుండా మా చేత కొనిపించుకునే తాగేదని, దానినే హీరోయిన్ అలవాటుగా సెట్ చేశానని వివరించాడు. దీంతో ట్రైన్ లో హీరోయిన్ కు కౌంటర్ పడటమే కాకుండా.. దర్శకుడు టీమ్ ఇలా ఒక్కో డైరెక్టర్ తో తన రియల్ లైఫ్ ఇన్సిడెంట్లను చెప్పించి, వాటిని ప్రోమోలుగా కట్ చేసుకుని సినిమా ప్రమోషన్ లో భాగంగా వాడేస్తారని అనిపిస్తోంది. మరి ఈ లెక్కన చూస్తుంటే, దర్శకుడు వాడకం డైరెక్టర్స్ నుంచే మొదలు పెట్టాడేమో అనిపించడం నిజంగా విశేషమే అవుతుంది.

వీడియో : https://www.youtube.com/watch?v=NmaB5jINQz4