బాలీవుడ్ కు సుకుమార్.. హీరో ఎవ‌రంటే..!

Last Updated on by

హిందీలో ఇప్పుడు తెలుగు ద‌ర్శ‌కుల‌కు చాలా క్రేజ్ ఉంది. మ‌న ద‌ర్శ‌కులు ఓకే అనాలే కానీ అక్క‌డి హీరోలు వ‌చ్చి ఎగ‌బ‌డిపోతున్నారు. సుకుమార్ కూడా ఇప్పుడు ఇదే చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. ఈయ‌న కూడా బాలీవుడ్ కి వెళ్ల‌నున్నాడ‌ని.. ఈ మ‌ధ్యే వ‌రుణ్ ధావ‌న్ తో ఓ క‌థ కూడా చెప్పాడు అనే వార్త‌లు బాగానే వినిపిస్తున్నాయి. రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత సుకుమార్ రేంజ్ పెరిగిపోయింది. ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను తిర‌గ‌రాయ‌డంతో ఈ ద‌ర్శ‌కుడి కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే త‌ర్వాతి సినిమా మ‌హేశ్ తో చేస్తాన‌ని చెప్పాడు కూడా. ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు స‌డ‌న్ గా బాలీవుడ్ ప్ర‌యాణం కూడా పెట్టుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఎలాగూ మ‌హేశ్ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ వ‌ర‌కు దొర‌క‌డు. ఆయ‌న వంశీ పైడిప‌ల్లితో బిజీ. దాంతో ఇప్పుడు వ‌రుణ్ ధావ‌న్ కు ఆర్య క‌థ చెప్పాడ‌ని తెలుస్తుంది. త‌న‌కు అవ‌కాశం వ‌స్తే బాలీవుడ్ లో ఆర్య సినిమాను రీమేక్ చేస్తాన‌ని చాలా ఏళ్లుగా చెబుతున్నాడు సుకుమార్. ఇప్పుడు ఆ టైమ్ వ‌చ్చింది. అన్నీ కుదిర్తే వ‌రుణ్ ధావ‌న్ తో ఆర్య రీమేక్ చేసి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. జీ గ్రూప్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఇదే కానీ వ‌ర్క‌వుట్ అయితే ఇప్పుడు వ‌రుణ్ కు ఉన్న ఇమేజ్ ఆర్య‌కు బాగానే సూట్ అవుతుంది. తెలుగు నుంచి ఇప్ప‌టికే క్రిష్.. దేవాక‌ట్టా లాంటి ద‌ర్శ‌కులు బాలీవుడ్ కు వెళ్లారు. ఇప్పుడు సుకుమార్ కూడా ఇదే చేయ‌బోతున్నాడు.

User Comments