సైలెంట్ గా మొద‌లుపెట్టిన త‌రుణ్..

త‌రుణ్ అంటే హీరో త‌రుణ్ కాదు..! అస‌లే ఆ మ‌ధ్య డ్ర‌గ్స్ కేసులో మ‌నోడి పేరు ఎక్కువ‌గా వినిపిస్తుంది. మ‌నం మాట్లాడుకుంటున్న‌ది ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ గురించి. పెళ్లిచూపులు అనే సినిమాతో ఇండ‌స్ట్రీని ఉలిక్కిప‌డేలా చేసాడు త‌రుణ్ భాస్క‌ర్. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసాడు గానీ ఈ ద‌ర్శ‌కుడి పేరు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఒక్క సినిమాతో ఇండియా మొత్తాన్ని ఊపేసాడు. పెళ్లిచూపులు ప్ర‌స్తుతం త‌మిళ్ లో రీమేక్ అవుతుంది.. హిందీలోనూ రీమేక్ చేయ‌బోతున్నారు.. క‌న్న‌డ‌లో ఆల్రెడీ ప్రాసెస్ న‌డుస్తుంది. మిగిలిన భాష‌ల్లోనూ పెళ్లిచూపులుపై క‌న్నుప‌డింది. టాలీవుడ్ లో ఈ కుర్రాడి పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. పెళ్లిచూపులును త‌రుణ్ తెర‌కెక్కించిన తీరు దాస‌రి లాంటి పెద్దోళ్ళ నుంచీ.. రాజ‌మౌళి లాంటి దిగ్గ‌జాల వ‌ర‌కు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

తొలి సినిమా అంత పెద్ద స‌క్సెస్ అయినా కూడా రెండో సినిమా విష‌యంలో మాత్రం తొంద‌ర‌ప‌డ‌లేదు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే కొంద‌రు నిర్మాత‌లు అడ్వాన్సుల‌తో త‌రుణ్ కు ఆఫ‌ర్ ఇచ్చారు. కానీ మ‌నోడు మాత్రం దేనికి టెమ్ట్ అవ్వ‌లేదు. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ త‌న రెండో సినిమాను మొద‌లుపెట్టాడు త‌రుణ్ భాస్క‌ర్. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లోనే ఈ చిత్రం ఉండ‌బోతుంది. అంతా కొత్త వాళ్ళ‌తోనే ఈ చిత్రం కూడా తీయాలనుకొంటున్నాడు త‌రుణ్. ఈ చిత్రం కోస‌మే క్యాస్టింగ్ కాల్ కూడా ఇచ్చాడు త‌రుణ్. అన్నీ కుదిర్తే.. తాను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ సైన్మానే పెద్ద సినిమాగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు త‌రుణ్ భాస్క‌ర్. దాంతో పాటు దిల్ చాహ‌తా హై త‌ర‌హాలో ఓ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఏం చేసినా.. తాను చేసే సినిమాల‌న్నీ తెలంగాణ యాస‌లోనే ఉంటాయంటున్నాడు త‌రుణ్ భాస్క‌ర్.