అప్పుడు ఇవివి.. ఇప్పుడు పూరీ

Last Updated on by

ఇవివి స‌త్య‌నారాయ‌ణ‌.. పూరీ జ‌గ‌న్నాథ్.. ఇద్ద‌రూ ట్రెండ్ సెట్టింగ్ ద‌ర్శ‌కులే. తెలుగు ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు ఇచ్చినోళ్లే. స్టార్ హీరోలంద‌రితో ప‌ని చేసిన ద‌ర్శ‌కులే. ఒక‌ప్పుడు ఇవివి అంటే హీరోలంతా ఎగ‌బ‌డేవాళ్లు. అంతెందుకు సాక్షాత్తు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడే ఇవివి స‌త్య‌నారాయ‌ణ‌. మిలీనియం మొదటి వ‌ర‌కు కూడా ఇవివి హ‌వా ఓ రేంజ్ లో న‌డిచింది. ఇక ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఇదే రేంజ్ లో మాయ చేస్తున్నాడు. ఇప్పుడంటే కాస్త స్లంప్ లో ఉన్నాడు కానీ మొన్న‌టి వ‌ర‌కు కూడా పూరీ అంటే స్టార్స్ అంతా సై అనేవాళ్లు. టెంప‌ర్ వ‌ర‌కు ఈయ‌న త‌న టెంపర్ చూపించాడు. ఆ త‌ర్వాత గాడి త‌ప్పాడు. అయితే ఇప్పుడు ఇవివితో పూరీని పోల్చ‌డానికి కార‌ణం ఉంది. ఇద్ద‌రూ తమ వార‌సుల విష‌యంలో ఒకేలా ఆలోచించారు. ఇవివి బ‌తికున్న‌పుడు ఆయ‌న జీవితంలో చివ‌రి ప‌దేళ్లు కొడుకులు అల్ల‌రి న‌రేష్, ఆర్య‌న్ రాజేష్ తో త‌ప్ప వేరొక‌రితో సినిమాలు చేయ‌లేదు.

ఇప్పుడు పూరీ కూడా ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌టి హీరోల‌తో ప‌నిచేస్తూ వ‌చ్చిన పూరీ.. ఇప్పుడు ఇంట్లోనే ఓ హీరోను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆకాశ్ హీరోగా ఈయ‌న తెర‌కెక్కించిన మెహ‌బూబా మే 11న విడుద‌ల కానుంది. ఇది కానీ హిట్టైతే ఆటోమేటిక్ గా ఆకాశ్ పూరీకి క్రేజ్ వ‌స్తుంది. ఆ క్రేజ్ ను మ‌రింత పెంచ‌డానికి పూరీ క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టికే త‌న‌యుడు ఆకాష్ గురించి మాట్లాడుతూ మెహబూబా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్పాడు పూరీ. ఈ సినిమా విడుద‌ల‌వ్వ‌గానే మ‌రో సినిమాను త‌న‌యుడితోనే చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు పూరీ. ఇప్ప‌టికే క‌థ కూడా రాయ‌డం మొద‌లుపెట్టాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. స్క్రిప్ట్ రెడీ అవ్వ‌గానే వివ‌రాలు చెప్తానంటున్నాడు పూరీ. చూస్తుంటే ఈ ద‌ర్శ‌కుడు కూడా ఇవివి మాదిరే కొడుకును నిల‌బెట్టే ప‌నిలో బిజీ అయిపోయేలా ఉన్నాడు. ఈ ధ్యాస‌లో ప‌డి బ‌య‌టి హీరోల‌తో సినిమాలు చేయ‌డం మానేస్తాడేమో..?

User Comments