అమెజాన్‌పై టాలీవుడ్‌ యుద్ధం

Last Updated on by

సినిమా రిలీజైన 28 రోజుల‌కే డిజిట‌ల్ రిలీజ్ వ‌ల్ల పంపిణీదారుల‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతోందా? అంటే అవున‌నే వాద‌న వినిపిస్తోంది. నెల‌రోజులైనా అవ్వ‌క‌ముందే .. ఇంకా సినిమా థియేట‌ర్ల‌లో ఆడుతున్నా ఆన్‌లైన్‌లో సినిమా రిలీజైపోతో ఇక థియేట‌ర్ల‌కు ఎవ‌రు వ‌స్తారు? అన్న వాద‌న పంపిణీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. దీనివ‌ల్ల త‌మ‌కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. డిజిట‌ల్ రిలీజ్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల‌కు పంపిణీదారులు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.

భ‌ర‌త్ అనే నేను, రంగ‌స్థ‌లం లాంటి భారీ చిత్రాలు డిజిట‌ల్‌లో రిలీజైన చిక్కులు ఉండ‌వు. పెద్ద సినిమాల క్రేజుతో ముందే పంపిణీదారుల‌కు రిట‌ర్నులు వ‌చ్చేస్తాయి. అదే ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌కు మాత్రం తంటాలు త‌ప్ప‌డం లేద‌ని పంపిణీదారులు వాదిస్తున్నారు. దీనివ‌ల్ల చిన్న, మ‌ధ్య‌స్థ బ‌డ్జెట్‌ సినిమాల‌పై భారీ పెట్టుబ‌డులు పెట్టిన పంపిణీదారుకు న‌ష్టం త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తున్న ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, అంత‌రిక్షం చిత్రాల్ని ఇప్ప‌టికే అమెజాన్‌కు భారీ మొత్తాల‌కు అమ్మేశారు. అలానే థియేట్రిక‌ల్ హ‌క్కుల‌కు భారీ మొత్తాల్ని పంపిణీదారులు వెచ్చించారు. అయితే ఈ సినిమాల డిజిట‌ల్ రిలీజ్ వ‌ల్ల త‌మ‌కు న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని పంపిణీదారులు నిర‌స‌న‌ల‌కు దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. ఏపీ ఫిలింఛాంబ‌ర్ పెద్ద‌ల‌తో ఇందుకు సంబంధించి చ‌ర్చ‌లు సాగించేందుకు పంపిణీదారులు రెడీ అవుతున్నార‌ట‌. ఈ స‌మ‌స్య‌ను ఫిలింఛాంబ‌ర్ ఎలా ప‌రిష్క‌రిస్తుందోన‌న్న ఆస‌క్తిక‌ర చర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం నిర‌స‌న‌ల సెగ ప‌రిమితంగానే ఉన్నా.. మునుముందు సినీప‌రిశ్ర‌మ‌కు డిజిట‌ల్ ముప్పు ఉండ‌నే ఉంటుంద‌ని ప‌లువురు విశ్లేషిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌స్తుత గ‌డ‌బిడ ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్ వంటి భారీ సంస్థ‌ల‌పై టాలీవుడ్ పంపిణీదారుల యుద్ధం ఎంత‌వ‌ర‌కూ స‌ఫ‌ల‌మ‌వుతుందో వేచి చూడాల్సిందే.

User Comments