`ల‌క్ష్మీస్ ఎన్టీఆర్`పై దివ్య‌వాణి డ్రామా

Last Updated on by

రిలీజ్ ముంగిట `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` డోలాయ‌మానం గురించి తెలిసిందే. క‌ర్ణి సేన‌ల‌తో ప‌ద్మావ‌త్ కి ఎన్ని చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయో, ఆర్జీవీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ కి అన్ని చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి. అయితే ప‌ద్మావ‌త్ ఎపిసోడ్ లో భ‌న్సాలీని రాజ్ పుత్ – క‌ర్ణి సేన‌లు నేరుగా ఫిజిక‌ల్ గా దాడులు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇప్పుడు ఆర్జీవీకి అలాంటి స‌న్నివేశం ఎదురు కాక‌పోయినా ఇంచుమించి అంత ప‌ని జ‌రుగుతోంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఎన్నిక‌ల ముంగిట ఆర్జీవీ చేసిన కుట్ర ఇది! అంటూ తెలుగు దేశం నాయ‌కులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఈ సినిమాని ఎలా రిలీజ్ చేస్తార‌ని, బ‌యోపిక్ కేట‌గిరీలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌కూడ‌ద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు టీడీపీ నాయ‌కులు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ని ఆపాలంటూ ఎన్నిక‌ల క‌మీష‌న్ కు, అలాగే పోలీసుల‌కు ఫిర్యాదులు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు సీనియ‌ర్ న‌టి.. తేదేపా నాయ‌కురాలు దివ్య‌వాణి వంతు. స‌రిగ్గా రిలీజ్ కి రెండు రోజుల ముందు ఈ సినిమాని ఆపాల్సిందేనంటూ దివ్య‌వాణి ఈసీకి ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఓవైపు తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ లో ఈ సినిమాని భారీగా రిలీజ్ చేసేందుకు ఆర్జీవీ, రాకేష్ రెడ్డి బృందం స‌న్నాహాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఇంకా వివాదాలు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌డం లేదు. మ‌రి దివ్య‌వాణి ఫిర్యాదుపై ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మ‌రోవైపు స్వామి భ‌క్తి (చంద్ర‌బాబుపై)ని చాటుకునేందుకే దివ్య‌వాణి ఇలా చివ‌రి నిమిషంలో రాద్ధాంతం చేస్తోంద‌ని వైకాపా నాయ‌కులు సెటైర్లు వేయ‌డం ఆస‌క్తిక‌రం.

User Comments