దొంగ మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  కార్తీ, జ్యోతిక‌, స‌త్య‌రాజ్ త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 20 డిసెంబ‌ర్ 2019

నిర్మాత‌లు: వ‌యాకాం 18 స్టూడియోస్, సూర‌జ్ సాధ‌నా
సంగీతం: గోవింద్ వ‌సంత‌
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్.డి.రాజ‌శేఖ‌ర్
ఎడిటింగ్: వినాయ‌క్
ద‌ర్శ‌కుడు: జీతూ జోసెఫ్

ముందు మాట‌:
ఖాకీ- ఖైదీ లాంటి చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు అందుకుని దూకుడు పెంచాడు కార్తీ. గ‌త కొంత‌కాలంగా కెరీర్ ప‌రంగా ఉన్న డైల‌మా నుంచి బ‌య‌ట‌ప‌డి ప్ర‌స్తుతం స‌క్సెస్ స్ట్రీక్ వైపు వ‌చ్చాడు. ఆ క్ర‌మంలోనే మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ తో క‌లిసి `దొంగ‌` అనే మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించాడు. క‌మ‌ర్శియ‌ల్ అంశాల‌తో పాటు కొత్త‌ద‌నం నిండిన క‌థ‌ను ఎంచుకున్నాడ‌ని ఇప్ప‌టికే టీజ‌ర్, ట్రైల‌ర్ తెలిపాయి. ఇక ఇందులో అక్క త‌మ్ముళ్ల సెంటిమెంటు ఆక‌ర్షించింది. జ్యోతిక కార్తీకి అక్క‌గా న‌టిస్తుండ‌డంతో సూర్య అభిమానుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజైన దొంగ కార్తీకి మ‌రో హిట్ చిత్రంగా నిలిచిందా లేదా? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూ చ‌ద‌వాల్సిందే.

క‌థాక‌మామీషు:
విక్కీ (కార్తీ) గోవాలో ఒక దొంగ‌. జ‌్ఞాన‌మూర్తి (స‌త్య‌రాజ్) ఓ రిచ్ పొలిటీషియ‌న్. మారువేషంలో మూర్తి కొడుకుగా ఇంట్లో ప్ర‌వేశిస్తాడు విక్కీ. అత‌డికి పూర్తిగా న‌మ్మ‌కం క‌లిగాక ఆ ఇంటి నుంచి డ‌బ్బు దొంగిలించి పారిపోవాల‌న్న‌ది విక్కీ ప్లాన్. అయితే మూర్తి కుమార్తె అయిన పార్వ‌తి (జ్యోతిక‌) వ‌ల్ల‌ అత‌డి ప్లాన్ ఫెయిల‌వుతుంది. అస‌లింత‌కీ విక్కీ ఎవ‌రు?  జ్యోతిక‌తో అత‌డి రిలేష‌న్ ఏమిటి? జ‌్ఞాన‌మూర్తి ఇంటికే అత‌డు ఎందుకు వ‌చ్చాడు? ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? అన్న‌దే మిగ‌తా సినిమా.

కార్తీ ఇన్వాల్వ్ అయ్యి న‌టించినా ఫస్టాఫ్ కామెడీ డ‌ల్ గా సాగింది. అయితే కొన్నిచోట్ల కామెడీ బావుంది. సెకండాఫ్ ట్విస్టులు ఆస‌క్తిని రేకెత్తించాయి. అలాగే స‌స్పెన్స్ ని మెయింటెయిన్ చేసిన తీరు బావుంది. ప్రీక్లైమాక్స్ వ‌ర‌కూ ట్విస్టులు ట‌ర్నుల్ని కొన‌సాగించ‌డం ఆస‌క్తిక‌రం. అయితే కొన్ని డ్రాబ్యాక్స్ సినిమాని ఓవ‌రాల్ గా దెబ్బ కొట్టాయి. బోరింగ్ వైపు న‌డిపించాయి. దొంగ ఓ ప్రామిస్ చేసి అందులో ఫెయిల‌వ్వ‌డం అన్న‌ది ఈ క‌థ‌లో వాస్త‌విక‌త‌కు అద్దం ప‌ట్టింది.

న‌టీన‌టులు:
ఖైదీ- కార్తీ చిత్రాల్లో అద్భుతంగా న‌టించిన కార్తీ మ‌రోసారి దొంగ చిత్రంలోనూ చ‌క్క‌ని పెర్ఫామెన్స్ తో మెప్పించాడు. అయితే గెట‌ప్ విష‌యంలో మ‌రింత శ్ర‌ద్ధ పెట్టి ఉంటే బావుండేది. ఇక వెట‌ర‌న్ న‌టి జ్యోతిక బ్రిలియంట్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకుంది. త‌న‌కు ఇది ప‌ర్ఫెక్ట్ కంబ్యాక్ అని చెప్పాలి. అలాగే సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌రాజ్ ఒక రిచ్ పొలిటీషియ‌న్ గా అద్భుత న‌ట‌న‌తో మెప్పించారు. రాజ‌కీయ నాయ‌కుడి  పాత్ర‌లో వేరియేష‌న్స్ మెప్పించాయి. సీత త‌దిత‌ర ఆర్టిస్టులు చ‌క్క‌గా న‌టించారు.

టెక్నికాలిటీస్:
ద‌ర్శ‌కుడు జీతూ జోసెఫ్ ఒక సింపుల్ స్టోరి లైన్ తో ఫ్రెష్ లుక్ వ‌చ్చేలా ట్విస్టులు ట‌ర్నుల‌తో చ‌క్క‌ని స్క్రీన్ ప్లేని తీర్చిదిద్దారు. పాత్ర‌ల డీటెయిలింగ్ అంతే అద్భుతంగా కుదిరింది. అయితే స్క్రిప్టును వంద శాతం ఎగ్జిక్యూట్ చేయ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యారు. కార‌ణం ఏదైనా ఇది పాక్షిక విజ‌యం అనే అనుకోవాలి. ఇక ఆర్.డి.రాజ‌శేఖ‌ర్ ఛాయాగ్ర‌హ‌ణం అద్భుతం. అలాగే గోవింద్ వ‌సంత‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంది. పాట‌లు మాత్రం ఫెయిల‌య్యాయి. వినాయ‌క్ ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు అవ‌స‌రం మేర ప‌ర్ఫెక్ట్ గా కుదిరాయి.

ముగింపు:
అక్క‌డ‌క్క‌డ బావుంది.. ఓవ‌రాల్ గా `దొంగ` ఫెయిల్!

రేటింగ్:
2.5/5