రివ్యూ: ఈ న‌గ‌రానికి ఏమైంది

రివ్యూ: ఈ న‌గ‌రానికి ఏమైంది

న‌టీన‌టులు: విశ్వక్ సేన్, సుశాంత్, అభిన‌వ్, వెంక‌టేశ్ కాకురాల, అనీషా ఆంబ్రోస్ త‌దిత‌రులు

సినిమాటోగ్ర‌ఫీ: నికేత్ బొమ్మి

సంగీతం: వివేక్ సాగ‌ర్

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ద‌ర్శ‌కుడు: త‌రుణ్ భాస్క‌ర్

పెళ్లిచూపులు లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఇప్పుడు ఈయ‌న రెండో సినిమాతో వ‌చ్చాడు. ఈ న‌గ‌రానికి ఏమైంది అంటూ మ‌రోసారి ఫుల్ కామెడీతో వ‌చ్చేసాడు. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది..? ద‌్వితీయ విఘ్నాన్ని త‌రుణ్ భాస్క‌ర్ దాటేసాడా..?

క‌థ‌:

కార్తిక్(సుశాంత్).. వివేక్ (విశ్వ‌క్ సేన్).. ఉప్పు(వెంక‌టేశ్).. కౌశిక్(అభిన‌వ్) స్నేహితులు. షార్ట్ ఫిల్మ్స్ చేయాల‌నేది వాళ్ళ కళ‌. కానీ ఆ త‌ర్వాత అంద‌రూ విడిపోయి ఎవ‌రి లైఫ్ వాళ్లు బ‌తుకుతుంటారు. ఆ స‌మ‌యంలో కార్తిక్ పెళ్లి కుదిరి అంతా పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలోనే ఓ అమ్మాయి (అనీషా ఆంబ్రోస్) క‌లుస్తుంది. ఓ యూ ట్యూబ్ ఛానెల్ త‌ర‌ఫు నుంచి వ‌చ్చిన ఆమె కోసం త‌న క‌థ చెప్తాడు వివేక్. ఆ క‌థ‌లో త‌న‌కు ల‌వ్ బ్రేక‌ప్ ఉంటుంది. ఆ త‌ర్వాత అంతా తాగేసి మ‌త్తులోనే గోవా టూర్ వెళ్లిపోతారు. అక్క‌డేం జ‌రిగింది..? అస‌లు వీళ్ళు షార్ట్ ఫిల్మ్ తీసారా లేదా అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:

క‌థంటూ ఉంటే క‌దా.. ముందు క‌థ‌నం గురించి చెప్ప‌డానికి. ఇందులో క‌థేంటి అని అడిగితే నో అనే స‌మాధాన‌మే వ‌స్తుంది. అస‌లు క‌థ లేకుండా కేవ‌లం కామెడీతోనే న‌డిపించేసాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. ఇది నిజంగా ఆయ‌న బుర్ర‌కు ప‌రీక్షే.. దాన్ని అద్భుతంగా చేసాడు త‌రుణ్. స్క్రీన్ ప్లేలో ఎక్క‌డా చిన్న లోపం కూడా లేకుండా పేస్ తో న‌డిపించేసాడు. తొలి స‌న్నివేశం నుంచి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. ఇదే చేసాడు కూడా. ఎక్క‌డ ఏ సీన్ వ‌స్తుందో తెలియ‌దు కానీ వ‌చ్చిన ప్ర‌తీ సీన్ న‌వ్వించ‌డం మాత్రం ఖాయం. ఎమోష‌న్స్ లేకుండా కేవ‌లం న‌వ్వు న‌వ్వు అంటూ క‌డుపులు చెక్క‌లు చేసాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా డైలాగ్స్ విష‌యంలోనే ఎక్కువ‌గా న‌వ్వొస్తుంది.

రోజూ మ‌నం మాట్లాడుకునే మాట‌లే స్క్రీన్ పై క‌నిపిస్తుంటాయి. అది ఇంకా ఎక్కువ న‌వ్వు తెప్పిస్తుంది. ప్రీ ఇంట‌ర్వెల్ సీన్ లో బార్ లో జ‌రిగే ర‌చ్చ నుంచి అస‌లు సినిమా మొద‌ల‌వుతుంది. గోవా వెళ్లిన త‌ర్వాత పిచ్చి పీక్స్ కు వెళ్లిపోతుంది. అక్క‌డ షార్ట్ ఫిల్మ్ తీసే క్ర‌మంలో కాస్త స్లో అవుతుంది కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ పైకి లేపాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా విశ్వ‌క్ సేన్ సైకో యాక్ష‌న్ మాత్రం అదిరిపోయింది. అత‌డికి, అభిన‌వ్ కు మ‌ధ్య వ‌చ్చే సీన్స్ హిలేరియ‌స్ గా పేలాయి. క్లైమాక్స్ వ‌ర‌కు కూడా పెద్దగా ట్విస్టులు ఏం లేకుండానే క‌థ ముందుకెళ్తుంది. పెళ్లిచూపులు రేంజ్ లో ఊహించుకుని వెళ్తే క‌ష్ట‌మే కానీ న‌వ్వుకోడానికి మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది ప‌ర్ ఫెక్ట్ ఛాయిస్.

న‌టీన‌టులు:

ఇందులో న‌లుగురు హీరోలున్నారు. న‌లుగురు బాగా చేసారు. ముఖ్యంగా విశ్వ‌క్ అద్బుతంగా న‌టించాడు. ఈయ‌న కారెక్ట‌ర్ కు ఎక్కువ‌గా పేస్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. సైకోయిక్ గా ఉండే ఈ పాత్ర‌తో సూప‌ర్ ఫ‌న్ పండించాడు ద‌ర్శ‌కుడు త‌రుణ్. ఇక కార్తిక్ గా సుశాంత్ రెడ్డి బాగున్నాడు. హై క్లాస్ లుక్స్ తో పిచ్చెక్కించాడు. అభిన‌వ్ పాత్ర పెళ్లిచూపులులో ప్రియ‌ద‌ర్శిని గుర్తు చేస్తుంది. త‌న‌కు ఉన్నంత మేర‌లో బాగానే న‌వ్వించాడు ఈ క‌మెడియ‌న్. ముఖ్యంగా వివేక్ పాత్ర‌తో వ‌చ్చే సీక్వెన్స్ బాగా పేలింది. వెంక‌టేశ్ కాకురాల బాగా చేసాడు. అనీషా ఆంబ్రోస్ తో పాటు సిమ్ర‌న్ చౌద‌రి త‌మ పాత్ర‌ల మేర‌కు ప‌ర్లేద‌నిపించారు.

టెక్నిక‌ల్ టీం:

పెళ్లిచూపులుకు కూల్ మ్యూజిక్ ఇచ్చిన వివేక్ సాగ‌ర్.. ఈ సారి కాస్త డోస్ పెంచేసాడు. పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా బ్యాంగ్రౌండ్ స్కోర్ బాగుంది. కొత్త‌గా ఉంది విన‌డానికి. ఇక ఆగి ఆగి పాట బాగుంది. నికేత్ బొమ్మ సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. గోవా అందాల‌ను బాగానే చూపించాడు. ఎడిటింగ్ కాస్త వీక్. సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడిగా త‌రుణ్ భాస్క‌ర్ మ‌రోసారి స‌క్సెస్ అయ్యాడు. అంతా కొత్త‌వాళ్ల‌తో ఇలాంటి స‌బ్జెక్ట్ చేయ‌డం సాహ‌స‌మే. కానీ చేసాడు త‌రుణ్. కామెడీతో ప‌ర్లేదు కానీ క‌థ కావాలంటే మాత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది మైన‌స్ గానే మిగిలిపోయింది.

చివ‌ర‌గా:

ఈ న‌గ‌రానికి ఏమైంది.. ఫుల్లుగా కామెడీలో మునిగిపోయింది.

రేటింగ్: 2.75/5.0