2018 క‌లిసొచ్చిందంటోంది!

2018 లో `అర‌వింద స‌మేత` లాంటి భారీ చిత్రంలో న‌టించింది ఇషా రెబ్బా. మారుతి స్క్రిప్టు అందించిన `బ్రాండ్‌బాబు` చిత్రంలోనూ నాయిక‌గా న‌టించింది. ఈ భామ న‌టించిన తాజా చిత్రం `సుబ్ర‌మ‌ణ్య‌పురం` రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సుమంత్ – ఇషా రెబ్బా జంట‌గా న‌టించిన `సుబ్ర‌మ‌ణ్య పురం` ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో విలేక‌రుల‌తో ముచ్చ‌టిస్తూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని వెల్ల‌డించింది.

ఇషా రెబ్బా మాట్లాడుతూ-“ఈ ఏడాది న‌టించిన సినిమాల‌న్నీ సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాల్ని అందించాయి. కెరీర్ ప‌రంగా ఎలాంటి అసంతృప్తి లేదు. అర‌వింద స‌మేత‌లో తార‌క్ సోద‌రిగా న‌టించాను. ఆ పాత్ర‌ను ఎన్టీఆర్ కోసం, త్రివిక్ర‌మ్ కోస‌మే అంగీక‌రించాను. అలాగే సుబ్ర‌మ‌ణ్య‌పురం చిత్రంలో సుమంత్ పాత్ర‌తో పూర్తిగా ఘ‌ర్ష‌ణ ప‌డే పాత్ర‌లో న‌టించాను. కార్తీక్- ప్రియ జంట మ‌ధ్య ఏం జ‌రిగింద‌నేది తెర‌పైనే చూడాలి. దేవుళ్ల‌ను న‌మ్మ‌ని వాడిగా కార్తీక్ క‌నిపిస్తే, ప‌ర‌మ‌భ‌క్తురాలిగా ప్రియ తెర‌పై క‌నిపిస్తుంది“ అని తెలిపింది. అలాగే త‌దుప‌రి చిత్రాల గురించి చెబుతూ.. త‌మిళంలో న‌వ‌త‌రం హీరో జీవీ ప్ర‌కాష్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తున్నాను. క‌న్న‌డ‌లో శివ‌రాజ్ కుమార్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తున్నాన‌ని ఇషా వెల్ల‌డించింది. మునుముందు ఇరుగుపొరుగు భాష‌ల్లో అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటాన‌ని ఇషా తెలిపింది.