రివ్యూ: ఎంత మంచివాడ‌వురా

రివ్యూ: ఎంత మంచివాడ‌వురా

న‌టీన‌టులు: క‌ళ్యాణ్‌రామ్‌, మెహ‌రీన్‌, సుహాసిని, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు

సాంకేతిక‌వ‌ర్గం: స‌ంగీతం: గోపీసుంద‌ర్‌, ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట‌, కూర్పు: త‌మ్మిరాజు, క‌ళ‌: రామాంజ‌నేయులు, స‌మ‌ర్ప‌ణ‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, నిర్మాత‌లు: ఉమేష్ గుప్త‌, సుభాష్ గుప్త‌,

ద‌ర్శ‌క‌త్వం: స‌తీష్ వేగేశ్న.

సంస్థ‌: ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌

స‌మ‌ర్ప‌ణ‌: శ‌్రీదేవి మూవీస్‌

విడుద‌ల‌: 15 జ‌న‌వ‌రి 2019

ముందుమాట‌
సంక్రాంతి సంద‌డిలో అన్నీ పెద్ద సినిమాలే కాదు. ఒక‌ట్రెండు మ‌ధ్య‌స్థ‌మైన బ‌డ్జెట్ సినిమాలు కూడా విడుద‌ల‌వుతుంటాయి. పెద్ద సినిమాల‌తో పోటీ ప‌డుతూ ప్రేక్ష‌కుల తీర్పుని కోరుతుంటాయి. ఆ కోటాలో ఈసారి క‌ళ్యాణ్‌రామ్ సినిమా `ఎంత మంచివాడ‌వురా` వ‌చ్చింది. ఎప్పుడూ మాస్ క‌థ‌ల‌తోనే క‌నిపించే క‌ళ్యాణ్‌రామ్ ఈసారి ఫ్యామిలీ ట‌చ్ ఇస్తూ చేసిన సినిమా ఇది. గుజ‌రాతీలో విజ‌య‌వంత‌మైన `ఆక్సిజ‌న్‌`కి రీమేక్‌గా తెర‌కెక్కింది. `శ‌త‌మానం భ‌వ‌తి`తో జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కించారు. పండ‌గ బ‌రి… మంచి క‌ల‌యిక‌… ఆక‌ట్టుకునే ప్ర‌చార చిత్రాలు.. పాట‌ల‌తో విడుద‌ల‌కి ముందే ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిందీ చిత్రం. మ‌రి ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థ‌లోకి వెళ‌దాం. 

క‌థ
బాలు (క‌ళ్యాణ్‌రామ్‌) న‌వ‌త‌రం యువ‌కుడు. షార్ట్ ఫిల్మ్స్‌లో న‌టించ‌డ‌మే అత‌ని ప‌ని. ఆల్ ఈజ్ వెల్ పేరుతో ఒక సంస్థ‌ని కూడా న‌డుపుతుంటాడు. అంద‌రికీ బాలుగానే తెలిసిన అత‌ను మారు పేర్ల‌తో మూడు కుటుంబాల‌కి ద‌గ్గ‌ర‌వుతాడు. వాళ్లతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట‌వుతాడు. ఇంత‌కీ బాలు ఎవ‌రు? మూడు పేర్ల‌తో చ‌లామ‌ణీ కావ‌ల్సిన అవ‌స‌రం ఎందుకొచ్చింది? ఆయ‌న స్థాపించిన ఆల్ ఈజ్ వెల్ సంస్థ ఉద్దేశం ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ‌
పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఇదొక మంచివాడి క‌థ‌. కాక‌పోతే మ‌న‌వాడి క‌థ అని ఏ కోశానా అనిపించ‌దు. వేరొక‌రి కొల‌త‌ల‌తో కుట్టిన చొక్కాలో మ‌నం దూరిపోతే ఎలా ఉంటుందో అలాంటి అనుభ‌వాన్నే ఇస్తుందీ చిత్రం. కొన్ని తెచ్చుకున్న రీతిలో పండిన భావోద్వేగాల‌తోనూ, బ‌ల‌వంతంగా న‌వ్వించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుండే హాస్యంతో ఏ కోశానా ఆస‌క్తి రేకెత్తించ‌దీ చిత్రం. భావోద్వేగాలే ఈ సినిమాకి బ‌లం. క‌థ కానీ, పాత్ర‌లు కానీ… వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్టు అనిపిస్తేనే భావోద్వేగాలు పండుతాయి. ఈ క‌థ‌నీ, పాత్రల్నీ ప్రేక్ష‌కుడు ఏ ద‌శ‌లోనూ ఓన్ చేసుకోలేడు. దాంతో ప్ర‌తి స‌న్నివేశం అలా అలా చ‌ప్ప‌గా సాగుతూ ముందుకు వెళ్లిపోయింది. ఫ్లాష్ బ్యాక్‌తో ఈ క‌థ మొద‌ల‌వుతుంది. హీరో, అత‌ని స్నేహితుల మ‌ధ్య ఆరంభంలో హాస్యం పండించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ త‌ర్వాత ఎదుటివాళ్ల‌కి అవ‌స‌ర‌మైన బంధాల్ని, భావోద్వేగాల్ని పంచ‌డంలో భాగంగా క‌థానాయ‌కుడు చేసే ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. అదే సినిమాకి కోర్ పాయింట్‌. కానీ అక్క‌డే ఎలాంటి భావోద్వేగాల్ని రేకెత్తించ‌లేక‌పోయారు ద‌ర్శ‌కుడు. క‌థ‌లోకి ప్ర‌తినాయ‌కుడు రావ‌డం, హీరో అత‌న్ని అరెస్ట్ చేయించ‌డంతో క‌థ విరామంవైపుగా వెళుతుంది. ద్వితీయార్థంలో కొన్ని మ‌లుపులు, ఆ త‌ర్వాత వ‌చ్చే కేర‌ళ ఎపిసోడ్ ఆక‌ట్టుకుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం మామూలే. ఫార్మాలిటీగా అన్న‌ట్టుగా ఎలాంటి కొత్త‌ద‌నం లేకుండా సాగిపోతుంటాయి. `శ‌త‌మానం భ‌వ‌తి`తో మంచి భావోద్వేగాలు పంచిన స‌తీష్ వేగ‌శ్న, మ‌ళ్లీ ఆ మేజిక్‌ని సృష్టించ‌లేక‌పోయాడు. ఆయ‌న ఎంతగా స‌న్నివేశాల్ని మార్చి రాసుకున్న‌ప్ప‌టికీ క‌థ‌లో స‌హ‌జ‌త్వాన్ని తీసుకురాలేక‌పోయారు. పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్రం మెప్పిస్తుంది.

న‌టీన‌టులు… సాంకేతిక‌త‌
క‌ళ్యాణ్‌రామ్ కుటుంబ క‌థ‌లో కనిపించ‌డం కొత్త‌గా అనిపిస్తుంది. అయితే ఆయ‌న శైలి మాస్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. వాటిలో ఒదిగిపోయినంత‌గా భావోద్వేగాల‌తో కూడిన స‌న్నివేశాల‌పై ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. అందుకు కార‌ణం ఆ స‌న్నివేశాల్ని డిజైన్ చేసిన విధాన‌మే అని చెప్పొచ్చు. మెహ‌రీన్ అందంగా క‌నిపిస్తూనే, అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాల్ని క‌నిపిస్తుంది. పాట‌ల్లో ఆమె చాలా బాగా క‌నిపించింది. త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌బాబు, సుహాసిని త‌దిత‌రులు పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వెన్నెల‌కిషోర్ మెహ‌రీన్‌కి బావ‌గా క‌నిపిస్తాడు. హీరోకి తండ్రిగా క‌నిపించే న‌రేష్‌, హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ కామెడీ కోసం చాలా ప్ర‌య‌త్నం చేసింది కానీ అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. రాజీవ్ క‌న‌కాల విల‌నిజం మెప్పిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. రాజ్ తోట కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. గోపీసుంద‌ర్ సంగీతం వెంటాడుతుంది. ఏమో ఏమో, అవునో తెలియ‌దు.. పాట‌లు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఆదిత్య మ్యూజిక్ సంగీత రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగింది. వాళ్లు తొలిసారి నిర్మాణంలోకి దిగి చేసిన సినిమా ఇది. మంచి విలువ‌లు క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌. కానీ ఆ ప్ర‌భావం సినిమాపై ఏమాత్రం క‌నిపించ‌లేదు. అక్క‌డ‌క్క‌డా సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయంతే. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న ఇంకా ఓల్డ్ ఫార్మాట్‌ని వ‌దిలి బ‌య‌టికి రాలేద‌నిపిస్తుంది.

బ‌లాలు
సంగీతం
భావోద్వేగాల‌తో కూడిన కొన్ని స‌న్నివేశాలు
క‌ళ్యాణ్‌రామ్‌, మెహ‌రీన్ న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు
క‌థ, క‌థ‌నం
వినోదం లేకపోవ‌డం
భావోద్వేగాలు పండ‌క‌పోవ‌డం

ఫైన‌ల్‌గా: ఆల్ ఈజ్ నాట్ వెల్

రేటింగ్: 2.0/5