న‌టుడు, మాజీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ క‌న్నుమూత‌

తేదేపా సీనియర్‌ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. శివప్రసాద్‌ మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ప్ర‌స్తుత ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంతాపం తెలిపారు. చంద్రబాబు నిన్న సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య వృత్తిని అభ్యసించారు. తొలి నుంచి ఆయ‌న తెలుగు సినీప‌రిశ్ర‌మ‌తో స‌త్సంబంధాలు క‌లిగి ఉన్నారు. న‌టుడిగా పాపుల‌ర‌య్యారు.

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఆయ‌న మృతిప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించింది. ప‌లువురు టాలీవుడ్‌ ప్రముఖులు శివప్రసాద్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించిన శివ‌ప్ర‌సాద్ తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించారు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 2006లో `డేంజర్‌` చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.  అనంత‌రం రాజ‌కీయారంగేట్రం చేశారు. తేదేపాలో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు తెలియ‌జేయ‌డం ద్వారా ఆయ‌న విల‌క్ష‌ణ నాయ‌కుడిగానూ గుర్తింపును తెచ్చుకున్నారు.