`ఎఫ్ 2` మూవీ రివ్యూ

Last Updated on by

న‌టీన‌టులు: వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్, ప్ర‌కాష్ రాజ్, రాజేంద్ర‌ప్ర‌సాద్, స‌త్యం రాజేష్‌, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి
నిర్మాత‌: దిల్ రాజు
సంగీతం: దేవీశ్రీ ప్ర‌సాద్
రిలీజ్ తేదీ: 12-01-2018

సంక్రాంతి బ‌రిలో రిలీజ‌వుతున్న నాలుగో సినిమా `ఎఫ్‌2- ఫ‌న్ & ఫ్ర‌స్టేష‌న్`. టైటిల్, క్యాప్ష‌న్ కి త‌గ్గ‌ట్టే ఈ చిత్రంలో బోలెడంత ఫ‌న్, ఫ్ర‌స్టేష‌న్ ఉంటుంద‌ని ఇదివ‌ర‌కూ రిలీజైన ట్రైల‌ర్ చెప్పింది. ట్రైల‌ర్‌తోనే ఈ సినిమాపై అంచ‌నాలు డ‌బుల్ అయ్యాయి. ఈ సంక్రాంతి బ‌రిలో అంతేగా అంతేగా అంటూ ఫ్యామిలీ కంటెంట్ తో సైలెంట్ హిట్ కొడుతున్నారా? అంటూ ముచ్చ‌టా సాగింది. మ‌ల్లీశ్వ‌రి, నువ్వు నాకు న‌చ్చావ్ త‌ర్వాత వెంకీ పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో న‌టించారు. వెంకీతో పాటు వ‌రుణ్ తేజ్ నైజాం యాక్సెంట్ ప‌లికిస్తూ కామెడీ పండించే పాత్ర‌లో కొత్త‌గా ప్ర‌య‌త్నించాడు. ప‌టాస్, రాజా ది గ్రేట్ లాంటి చిత్రాల‌తో బంప‌ర్ హిట్లు కొట్టిన అనీల్ రావిపూడి కామెడీ టైమింగ్ పై అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు, ప్రేక్ష‌క జ‌నాల‌కు ఓ న‌మ్మ‌కం. అయితే ఇన్ని ర‌కాల బ‌లాల‌తో తెర‌కెక్కిన ఈ కామెడీ ప్యాక్డ్ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్ని ఎంత‌వ‌ర‌కూ మెప్పించింది? అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థ‌
భార్యా భ‌ర్త‌లు అన్నాక ప్రేమ‌, అనుబంధంతో పాటు కీచులాట‌లు, ఫ్ర‌స్టేష‌న్ కూడా త‌ప్ప‌నిస‌రి. అలాగే అమ్మాయి- అబ్బాయి మ‌ధ్య ప్రేమ‌కథ‌లోనూ ఇవ‌న్నీ ఉంటాయి. అలాగ‌ని పెళ్లాంపైన మొగుడు, ప్రియురాలిపైన ప్రేమికుడు అలిగి దూరంగా ఎస్కేప్ అయిపోవాల‌ని అనుకుంటే కుదురుతుందా? ఆ ఫ్ర‌స్టేష‌న్ లో పెళ్లాలు కూడా త‌మ‌లాగే ఆలోచించి వేరొక‌రిని పెళ్లాడేయాల‌నుకుంటే ప‌రిస్థితి ఏమైపోతుంది? సీన్ సితారైపోదూ? అచ్చం `క్షేమంగా వెళ్లి లాభంగం రండి` త‌ర‌హాలో పెళ్లాల్సి దూరం పెట్టి ఫారిన్ వెళ్లి ఎంజాయ్ చేద్దామ‌ని అనుకుంటే, ప్లాన్ బెడిసి కొట్టి అక్క‌డే పెళ్లాలు ప్ర‌త్య‌క్ష‌మైతే ఏమ‌వుతుంది? ఆ మ‌గువ‌లు వేరొక మ‌గాడిని పెళ్లాడాల‌నుకుంటే ఇంకేమైనా ఉందా? లైఫ్ లో ఫ‌న్ దాంతో పాటే ఫ్ర‌స్టేష‌న్ ఇంకా రెట్టింపు అయిపోతాయి. ఫ్ర‌స్టేష‌న్ లోంచే బోలెడంత కామెడీ పుడుతుంది… ఇదీ సింపుల్ గా బేసిక్ లైన్. ఎన్ని ఉన్నా.. సంద‌ట్లో స‌డేమియాలాగా ఆడాళ్ల‌ను ప‌ట్టించుకోవాలి.. గౌర‌వించాలి! అన్న సందేశం ఇచ్చారు.

క‌థనంలోకి వెళితే.. విదేశాల్లో వెంకీ, వ‌రుణ్ ఇద్ద‌రూ అరెస్టుతో ఎంట్రీ సీన్ మొద‌ల‌వుతుంది. ఒక్క‌సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే వెంకీ ఎంఎల్ఏ (ర‌విబాబు) వ‌ద్ద పీఏగా ప‌ని చేస్తుంటాడు. అత‌డు వ‌ధువును వెతుకుతూ త‌మ‌న్నాను చూడ‌టానికి వెళ‌తాడు. త‌న‌ని పెళ్లాడుతాడు. ఆ క్ర‌మంలోనే అక్కా- బావ (వెంకీ- త‌మ‌న్నా) ఇంటికి వ‌స్తుంది మెహ్రీన్. క‌ట్ చేస్తే వ‌రుణ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్. మెహ్రీన్ కి బోయ్‌ఫ్రెండ్ ఉన్నాడా లేడా? అది ప్రూవ్ చేస్తానంటూ వెంకీ స‌వాల్ విసురుతాడు. ఇక వ‌రుణ్- మెహ్రీన్ ల‌వ్ ర‌న్ అవుతుంటుంది. లైఫ్‌లో ఫ‌న్ ఫ్ర‌స్టేష‌న్ న‌డుమ వ‌రుస‌కు తోడ‌ల్లుళ్లు (వెంకీ- వ‌రుణ్) యూర‌ఫ్ వెళ్లిపోతారు. ఆ ట్రిప్ లో వీళ్ల గ్యాంగ్ కి రాజేంద్ర‌ప్ర‌సాద్ యాడ‌వుతాడు. వీళ్లంతా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న టైమ్ లో ఊహించ‌ని ట్విస్టు. వీళ్ల‌ను వెతుక్కుంటూ పెళ్లాలు యూర‌ఫ్ లో దిగుతారు. అక్క‌డికి వ‌చ్చిన మిషన్ ప్ర‌కాష్ రాజ్ కొడుకులు స‌త్యం రాజేష్, సుబ్బ‌రాజుల‌ను 10రోజుల్లోనే పెళ్లాడేందుకు సిస్ట‌ర్స్ ప్లాన్. మొగుళ్ల‌కు టార్చ‌ర్ పెట్ట‌డ‌మే వీళ్ల ధ్యేయం. ఆ క్ర‌మంలోనే ఫ‌న్, ఎమోష‌న్ .. కామెడీ. చివ‌రికి పెళ్లాల మిష‌న్ స‌క్సెసైందా లేదా? ఆ ఆక‌తాయి మొగుడు, ల‌వ‌ర్ బోయ్ త‌మ త‌ప్పు తెలుసుకుని రియ‌లైజ్ అయ్యారా? లేదా? అన్న‌దే బ్యాలెన్స్ స్టోరి. ఈ క‌థ‌లో వెన్నెల కిషోర్ ఎంట్రీ ప్ర‌యోజ‌నం ఏంటి? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. ముందే చెప్పిన‌ట్టే సినిమా ఆద్యంతం ఫన్, ఫ్ర‌స్టేష‌న్ .. అందులోంచి పుట్టుకొచ్చే కామెడీ ఆక‌ట్టుకున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్
ఫ‌స్టాఫ్ కామెడీ ప్ల‌స్.. వెంకీ, వ‌రుణ్ పూర్తి కామెడీని పండించ‌డంలో స‌క్సెస‌య్యారు. వెంకీ మార్క్ కామెడీ అస్సెట్. త‌మ‌న్నా, మెహ్రీన్ గ్లామ‌ర్ మైమ‌రిపిస్తాయి. ఇత‌ర నటీన‌టులు త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయి న‌టించారు. రాజేంద్ర ప్ర‌సాద్, వెన్నెల కిషోర్ ల‌ను పూర్తి స్థాయిలో కామెడీకి వాడుకోలేక‌పోయారు. క‌థ అంత గొప్ప‌గా లేక‌పోయినా ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థ‌నంతో, కామెడీతో రంజింప‌జేయ‌డంలో అనీల్ రావిపూడి ప‌నిత‌నం పెద్ద ప్ల‌స్.

మైన‌స్ పాయింట్స్‌
సెకండాఫ్ లో ఆశించిన కామెడీ పండ‌లేదు. అయితే ఓవ‌రాల్ గా మూవీ ఫ‌న్ తో ఆక‌ట్టుకుంది.

సాంకేతిక వ‌ర్గం
టెక్నిక‌ల్ గా ఈ చిత్రాన్ని అద్భుత‌మైన విజువ‌ల్స్ తో చూపించ‌డంలో కెమెరా, దేవీశ్రీ మ్యూజిక్ ఓకే అనిపించాయి. ఇత‌ర విభాగాలు ఓకే. అనీల్ రావిపూడి క‌థ‌ను మ‌రింత గ్రిప్పింగ్ గా రాసుకోవాల్సింది. ప్ర‌థ‌మార్థంతో పోలిస్తే సెకండాఫ్ పాట‌లు కొంత బెట‌ర్.

చివ‌ర‌గా:
ఫ్యామిలీ ఆడియెన్ కు ఈ సంక్రాంతికి ఫుల్ ఫ‌న్ ప్యాక్డ్ ట్రీట్ `ఎఫ్ 2`.

రేటింగ్‌: 3.25/ 5.0

User Comments