క్వీన్‌పై ఫ్యాన్స్ పిచ్చి తుగ్ల‌క్ కామెంట్లు

క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప్ర‌స్తుతం `మ‌ణిక‌ర్ణిక‌: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` స‌క్సెస్ ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా స‌క్సెస్ మీట్‌ల‌తో కంగ‌న వేడెక్కిస్తోంది. స‌క్సెస్ మీట్‌లో అవ‌స‌రం మేర వివాదాల్ని క్యాష్ చేసుకునే ప్రయ‌త్నం చేస్తోంది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా క్రిష్ తో కంగ‌న వివాదం ప‌దే ప‌దే తెర‌పైకి వ‌స్తోంది. ఆ ప్ర‌శ్న అడ‌గ‌కుండా బాలీవుడ్ మీడియా మాత్రం కంగ‌న‌ను విడిచిపెట్ట‌డం లేదు. అయితే ఈ వివాదాన్ని కూడా కంగ‌న తెలివిగా మ‌ణిక‌ర్ణిక ప్ర‌చారానికి వాడేస్తోంది.

ఇదివ‌ర‌కూ కంగ‌న విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ ఇదే త‌ర‌హా చిక్కు ప్ర‌శ్న ఎదురైంది. క్రిష్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. మ‌ణిక‌ర్ణిక చిత్రంలో సోనూసూద్ పాత్ర‌ను తొల‌గించి, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌ను పూర్తిగా తగ్గించేశారంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి? అందుకు కార‌ణం క్రిష్ స్నేహితులు అవ్వ‌డ‌మేనా? అని ప్ర‌శ్నిస్తే.. సోనూని పూర్తిగా చూపిస్తూ క్రిష్ ని సినిమా తీయ‌మ‌ని చెప్పండి! అంటూ సెటైర్ వేసింది. మ‌ణిక‌ర్ణిక స‌క్సెస్ వెన‌క త‌న క‌ఠోర శ్ర‌మ దాగి ఉంద‌ని, ఈ స‌క్సెస్ క్రెడిట్ మొత్తం త‌న‌కే ద‌క్కుతుంద‌న్న తీరుగా కంగ‌న వ్య‌వ‌హ‌రించ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు తాజాగా లాక్మే ముంబై ఫ్యాష‌న్ వీక్ లో క‌నిపించి పెద్ద షాకిచ్చింది. ఇక కంగ‌న ఫోటోల్ని ప్ర‌ఖ్యాత వైర‌ల్ భ‌యానీ ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోల‌కు ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు ఎదుర‌య్యాయి. ముఖ్యంగా క్వీన్ ఫ్యాష‌న్స్ & ట్రెండ్ ని విమ‌ర్శిస్తూ ఓ నెటిజ‌న్ అస‌భ్యంగానే ఎటాక్ చేశాడు. ఇలా శ‌రీరాన్ని చూపించి డ‌బ్బు సంపాదించే బాలీవుడ్ న‌టీమ‌ణుల‌ కంటే .. అండ‌ర్‌వేర్ ప్ర‌క‌ట‌న‌లు చేసుకుని సంపాదించే మోడ‌ల్స్ బెట‌ర్ అని .. వ్యాఖ్యానించారు. ఇక గ్యాంగ్ స్ట‌ర్ చిత్రంలో న‌టించిన కంగ‌న ఈ స్థాయికి ఎదిగింది. త‌న ఆర్జ‌న చూసి జెల‌సీ ఫీల‌వుతున్నారా? అని ఒక అభిమాని వ్యాఖ్యానించారు. మొత్తానికి క్వీన్ కంగ‌న లెవ‌ల్ పెరిగింద‌న‌డానికి ఇవ‌న్నీ సింబాలిక్ అని భావించాల్సి ఉంటుంది.