Last Updated on by
ప్రేమకథా చిత్రాలకు ఉన్న గిరాకీ వేరు. థియేటర్లకు వచ్చేవాళ్లలో టీనేజ్, కాలేజ్ యూత్ ఎక్కువ కాబట్టి ఈ ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న తెలుగు రాష్ట్రాల్లో రిలీజవుతున్న రెండు సినిమాలపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ రెండు సినిమాల కథాకమామీషు ఏంటో పరిశీలిస్తే ఆద్యంతం ఆసక్తికరం. ఇవి రెండూ ప్రేమకథా చిత్రాలే. అయితే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్.. డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ తో వస్తున్న చిత్రాలు అని మేకర్స్ చెప్పినదానిని బట్టి, టీజర్, ట్రైలర్లను బట్టి అర్థమవుతోంది.
వింక్ గాళ్.. మలయాళ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14 న రిలీజవుతోంది. ఈ సినిమాలో రోషన్ కథానాయకుడిగా నటించారు. ప్రియా – రోషన్ కెమిస్ట్రీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఇక ఈ సినిమాని ఒమర్ లులు లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ యూత్ కి కనెక్టయ్యేలా చిత్రీకరించిన విధానంపైనా ఆసక్తికర చర్చ సాగింది. ఒకే ఒక్క వింక్ తో ప్రియా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానుల్ని సంపాదించుకోవడం ఈ సినిమాకి కలిసి రానుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ సాయం పైనా నిర్మాతలు గురురాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేమకథలకు ఉన్న మైలేజ్, ప్రియా ప్రకాష్ సెన్సేషన్స్ చూసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఇదే చిత్రం మలయాళంలో ఒరు ఆధార్ లవ్ పేరుతో ప్రేమికుల దినోత్సవాన రిలీజవుతోంది. ఈ సినిమాతో పాటే ఫిబ్రవరి 14న కార్తీ- రకుల్ జంటగా నటించిన `దేవ్` రిలీజవుతోంది. ఈ సినిమా టీజర్, పోస్టర్ దశ నుంచే ఆకట్టుకుంది. ఇటీవలే రిలీజైన ట్రైలర్ కి స్పందన అద్భుతంగా ఉంది. ఖాకీ తర్వాత కార్తీ నటించిన డిఫరెంట్ చిత్రమిది. ధనార్జన కోసం వెంపర్లాడే పక్కా బిజినెస్ ఉమెన్ తో ప్రేమలో పడ్డాక అసలు డబ్బు పిచ్చి లేని కుర్రాడి జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అన్నదే ఈ సినిమా కథాంశం. డబ్బున్న అమ్మాయిగా రకుల్ నటించింది. సోషల్ మీడియా ప్రేమల్ని తెరపై చూపించనున్నారు. రెండూ ప్రేమకథా చిత్రాలపై అంచనాలున్నాయి. అయితే ప్రమోషన్స్ పరంగా మరింత స్పీడ్ పెంచితేనే జనాల్లోకి వెళ్లి థియేటర్ల వైపు అడుగులు వేయించగలరు. మరో మూడు రోజుల్లోనే రిలీజ్ కాబట్టి వేచి చూడాల్సిందే. ఇక బాలీవుడ్ లో ప్రేమికుల రోజు కానుకగా రణవీర్ – ఆలియా జంట నటించిన గల్లీబోయ్ రిలీజవుతోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్సుల్లో తెలుగు సినిమాలతో ఏమేరకు పోటీపడుతుందో చూడాలి.
User Comments