ఫిలించాంబ‌ర్‌ కొత్త అధ్య‌క్షుడెవ‌రు?

తెలుగు ఫిలించాంబ‌ర్ అంటే నాలుగు కీల‌క సెక్టార్ల‌లో ఎంతో కీల‌క‌మైన‌ది. నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, స్టూడియో ఓన‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఈ నాలుగు విభాగాల్ని లీడ్ చేసిది ఫిలింఛాంబ‌ర్‌. ఇలాంటి కీల‌క విభాగానికి అధ్య‌క్షుని ఎంపిక అంటే అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కం. తాజాగా అధ్య‌క్షుడి ఎన్నిక పూర్త‌యింది. తెలుగు ఫిలించాంబ‌ర్ నూత‌న‌ అధ్య‌క్షుడిగా విశాఖ వాసి, పూర్వి పిక్చ‌ర్స్ అధినేత‌ వి.వీరినాయుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఆ మేర‌కు ఛాంబ‌ర్ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగులో ఏక‌గ్రీవ ఎన్నికను అధికారికంగా ప్ర‌క‌టించారు. 39వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగులో వీరినాయుడిని ఏక‌గ్రీవ అధ్య‌క్షునిగా ఎంపిక చేస్తూ మెంబ‌ర్స్ నిర్ణ‌యం తీసుకున్నారు. నేటి నుంచి ఆయ‌న కొత్త అధ్య‌క్షునిగా ఛార్జ్ తీసుకోనున్నారు.

ఇత‌ర కార్య‌వ‌ర్గం వివ‌రాలివి: ఫిలింఛాంబ‌ర్ ఉపాధ్య‌క్షుడిగా వి.సాగ‌ర్‌ని ఎంపిక చేశారు. అలానే పాత క‌మిటీలోని కె.బ‌సిరెడ్డి, ముత్త‌వ‌ర‌పు శ్రీ‌నివాస బాబు ఫిలించాంబ‌ర్ ఉపాధ్య‌క్షులుగా కొన‌సాగ‌నున్నారు. గౌర‌వ కార్య‌ద‌ర్శులుగా ముత్యాల రాందాస్‌, కె.శివ‌ప్ర‌సాద‌రావు(అలంకార్ ప్ర‌సాద్‌) కొన‌సాగుతున్నారు. గౌర‌వ ఉప‌కార్య‌ద‌ర్శులుగా మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల‌, వి.రామ‌కృష్ణ‌(ఆర్‌.కె), ఎం.సుధాక‌ర్, జె.మోహ‌న్‌రెడ్డి, పేర్ల సాంబ మూర్తి, ఎన్‌.నాగ‌రాజు, ట్రెజ‌ర‌ర్‌గా టి.రామ‌స‌త్య‌నారాయ‌ణ య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్నారు. నిర్మాత‌ల సెక్టార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా వ‌ల్లూరిప‌ల్లి ర‌మేష్‌బాబు, స్టూడియోస్ సెక్టార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా వై.సుప్రియ‌, డిస్ట్రిబ్యూట‌ర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా వి.నాగేశ్వ‌ర‌రావు, ఎగ్జిబిట‌ర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మ‌న్‌గా జి.వీర‌నారాయ‌ణ బాబు కొన‌సాగ‌నున్నారు.