ట్రెండింగ్‌: క్రికెట్ బ్యాక్‌డ్రాప్

Last Updated on by

ఏదైనా ఓ ట్రెండ్ మొద‌లైతే ఆ వ‌రుస‌లోనే సినిమాలు తీయ‌డం అన్న‌ది అనాదిగా ఉన్న‌దే. టాలీవుడ్ అందుకు మిన‌హాయింపేమీ కాదు. ఇటీవ‌ల బ‌యోపిక్ ల ట్రెండ్ కొన‌సాగుతోంది. ఇందులోనూ క్రీడాకారుల బ‌యోపిక్ లు వ‌రుస‌గా తెర‌కెక్కుతున్నాయి. బ‌యోపిక్‌ల తో సంబంధం లేక‌పోయినా ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య‌, నాని వంటి హీరోలు క్రికెట‌ర్లుగా ప్ర‌యోగాల‌కు దిగారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ క‌థాంశాల్ని ఎంచుకుని న‌టిస్తుండ‌డం ఓ కొత్త ట్రెండ్ కి నాంది ప‌లుకుతోంది.

ఇటీవ‌లి కాలంలో క్రికెట్ నేప‌థ్యంలో సినిమాలేవీ లేవు. అప్ప‌ట్లో ల‌గాన్ చిత్రం క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కి ఎంతో ప్ర‌భావితం చేసింది. ఆ త‌ర్వాత స‌చిన్, ధోనిల బ‌యోపిక్ లు ర‌క్తి క‌ట్టించి ఘ‌న‌విజ‌యాలు అందుకున్నాయి. కానీ అందుకు భిన్నంగా తెర‌కెక్కిన `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` చిత్రంలో క్రికెట్ ఫీవ‌ర్ గురించి చూపించారు. ఒక గొప్ప క్రికెట‌ర్ కి న‌క్స‌లైట్ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేసి ర‌క్తి క‌ట్టించారు. ఆ సినిమాకి నిజ‌జీవిత క్రికెట‌ర్ స్ఫూర్తి అని చెప్పుకున్నారు.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య – స‌మంత జంట‌గా శివ నిర్వాణ రూపొందిస్తున్న మ‌జిలీ చిత్రానికి క్రికెట్ బ్యాక్ డ్రాప్ ఉంద‌ని రివీల్ చేయ‌డం ఓ ర‌కంగా చై అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ అనే చెప్పాలి. మ‌రోవైపు నాని క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న జెర్సీ, విజ‌య్ దేవ‌ర‌కొండ `డియ‌ర్ కామ్రేడ్` చిత్రాలు క్రికెట్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ఇటీవ‌లే నాని, చై క్రికెట‌ర్ల లుక్ లు రిలీజ‌య్యాయి. అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాయి. అలాగే డియ‌ర్ కామ్రేడ్ కోసం దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక జంట క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నార‌న్న ప్ర‌చారం సాగింది. అయితే క్రికెట్ బ్యాక్ డ్రాప్ ప్ర‌యోగాలు అంటే స‌క్సెస్ ఎంత‌వ‌ర‌కూ ద‌క్కుతుంది? అన్న‌ది వేచి చూడాలి. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల ప్ర‌యోగాలు స‌క్సెసైతే ఇలాంటి కొత్త క‌థ‌లకు మ‌రింత ఉధృతి పెరుగుతుంద‌నడంలో సందేహం లేదు.

User Comments