మెగా క్యాంప్ లో శ్రీ‌కాంత్ అడ్డాల‌..

మంచి ద‌ర్శ‌కుడు.. చెడు అంటే అస్స‌లు ప‌డ‌ని ద‌ర్శ‌కుడు.. ఇవ‌న్నీ శ్రీ‌కాంత్ అడ్డాల‌కు ఇండ‌స్ట్రీలో ఉన్న పేర్లు. కానీ ఇప్పుడు ఇంత మంచి ద‌ర్శ‌కుడి ప‌రిస్థితి అస్స‌లు బాలేదు. ఒకే ఒక్క ప్లాప్ ఈయ‌న కెరీర్ ను మార్చేసింది. అదే బ్ర‌హ్మోత్స‌వం. మ‌హేశ్ లాంటి స్టార్ హీరోతో రెండో అవ‌కాశం రావ‌డం.. అది కూడా ముకుందా లాంటి ఏవరేజ్ సినిమా త‌ర్వాత పిలిచి మ‌రీ ఛాన్స్ ఇవ్వ‌డం అనేది నిజంగా అదృష్ట‌మే. కానీ మ‌హేశ్ న‌మ్మ‌కాన్ని చాలా మంది ద‌ర్శ‌కులు రెండోసారి వ‌మ్ము చేసారు. శ్రీ‌కాంత్ అడ్డాల కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. సీత‌మ్మ వాకిట్లో లాంటి సినిమా ఇచ్చిన ఈయ‌న‌.. మ‌హేశ్ కెరీర్ లోనే ఎప్పుడూ మ‌రిచిపోలేని డిజాస్ట‌ర్ ను బ్ర‌హ్మోత్స‌వం రూపంలో ఇచ్చాడు. తెలుగులోనే ఉన్న అర్థం కాని డైలాగ్స్ తో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. సీరియ‌ల్ కంటే దారుణంగా సాగే సీన్స్ తో చిరాకు పుట్టించాడు. ఈ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్న శ్రీ‌కాంత్ అడ్డాలకు కోలుకోలేని దెబ్బ తీసింది.

బ్ర‌హ్మోత్స‌వం ఫ్లాప్ కు క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ శ్రీ‌కాంత్ అడ్డాలే. సీత‌మ్మ వాకిట్లో లాంటి హిట్టిచ్చాడ‌నే న‌మ్మ‌కంతో క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు అన్నీ ఆయ‌న‌పై గుడ్డిగా వ‌దిలేసాడు సూప‌ర్ స్టార్. కానీ ఈ సినిమాకు ఆయ‌న ప‌డిన క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. పైగా మ‌హేశ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసాడంటూ శ్రీ‌కాంత్ అడ్డాల‌పై చివాట్లు కూడా ప‌డ్డాయి. ఈ సినిమా వ‌చ్చి ఏడాదిన్న‌ర గ‌డిచినా ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌లేదు శ్రీ‌కాంత్. కానీ ఈ స‌మ‌యంలో మరో క‌థ సిద్ధం చేసుకునే ప‌నిలోనే ఉన్నాడు శ్రీ‌కాంత్ అడ్డాల‌. ఈ ద‌ర్శ‌కుడిని ఇప్పుడు న‌మ్మి సినిమా ఇచ్చే హీరో ఎవ‌రూ క‌నిపించ‌ట్లేదు.

ముకుంద లాంటి ఏవరేజ్ ఇచ్చినా కూడా శ్రీ‌కాంత్ అడ్డాల‌ను ఎవ‌రూ విమ‌ర్శించ‌లేదు. కానీ బ్ర‌హ్మోత్స‌వం అలా కాదు.. కెరీర్ లో చెత్త సినిమా ఇదేనంటూ ఈ ద‌ర్శ‌కుడికి విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఇలాంటి టైమ్ లో ఈయ‌న‌కు త‌ర్వాతి సినిమా ఇచ్చే ధైర్యం ఏ హీరో చేస్తాడు..? అయితే ఈయ‌న మాత్రం ఇప్ప‌టికే మెగా క్యాంప్ లోకి చేరిపోయాడు. గీతాఆర్ట్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడ‌నే వార్త‌లైతే వినిపిస్తున్నాయి. ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇవ్వ‌డంలో గీతాఆర్ట్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ప‌రుశురామ్.. సురేంద‌ర్ రెడ్డి.. అప్ప‌ట్లో అంద‌రివాడు కోసం శీనువైట్ల‌.. ఇలా ప్ర‌తీ ఒక్క‌ర్నీ చేర‌దీస్తుంది. మ‌రి స‌రైన క‌థ కానీ రాసాడంటే మెగాహీరోల్లో ఎవ‌రో ఒక‌ర్ని శ్రీ‌కాంత్ చేతిలో పెట్టేస్తాడు అల్లు అర‌వింద్. మ‌రి చూడాలిక‌.. ఈ మంచి ద‌ర్శ‌కుడికి మంచి రోజులు ఎప్పుడొస్తాయో..?