ఈ శుక్ర‌వారం సోసోయేనా?

Last Updated on by

ఈ శుక్ర‌వారం నాలుగు సినిమాలు రిలీజ్‌ల‌కు వస్తున్నాయి. ఇవ‌న్నీ స్టార్ ఇమేజ్ లేనివే. అసాధార‌ణ‌మైన కంటెంట్ ఉంటేనే కానీ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు పుల్ చేయ‌లేనివి. నిర్మాత‌లు ఎంత నిజాయితీగా పెట్టుబ‌డి పెట్టారో కానీ, ప్రచారం ప‌రంగా అయితే అంత ప‌స లేదు. ఏదో రిలీజ్ ముందు ప్రెస్‌మీట్లు మిన‌హా పెద్దంత‌గా ఈ సినిమాల గురించే ఎవ‌రికీ తెలీదు.

ఇక‌పోతే దిల్‌రాజు త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసిన `ల‌వ‌ర్` సినిమా రిజ‌ల్ట్ ఏంటో నిన్న‌టి ఇంట‌ర్వ్యూలో ఆయనే చెప్పేశారు. తెలుగు సినిమా హిస్ట‌రీలో ఏ నిర్మాతా, త‌న హీరోని ఇలా ఎప్పుడూ అని ఉండ‌డు! ఫ్లాప్ హీరోనే క‌దా! అన్న దిల్‌రాజు మాట‌లు ప‌దే ప‌దే జ‌నాల చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. ప్రివ్యూల వేళ మీడియాలో దీనిపై మాట్లాడుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక‌పోతే ల‌క్ష్మీ మంచు `వైఫ్ ఆఫ్ రామ్` చిత్రంతో వ‌స్తోంది. ప్ర‌య‌త్నం బావున్నా.. ప్ర‌చారం సోసోనే. అందువ‌ల్ల ఈ సినిమా జ‌నాల‌కు ఎంత‌వ‌ర‌కూ రీచ్ అవుతుందో చూడాలి. చంద్ర సిద్ధార్థ్ `ఆట‌గ‌ద‌రా శివ` టైటిల్ బావున్నా.. ఫార్మాట్ డిఫ‌రెంట్ అన్నా థియేట‌ర్ల వ‌ర‌కూ జ‌నం వెళ్లాలంటే కొన్నాళ్లు ఆగాలి. అంత‌వ‌ర‌కూ థియేట‌ర్ల‌లో ఉంటే ఓకే. ఇక ఇప్పుడున్న సినిమాల్లో ఆర్ఎక్స్ 100 మాత్రం థియేట‌ర్లు పెంచుకునే లెవ‌ల్‌కి ఎదిగిందంటే జ‌నాల‌కు ఎక్కుతుంద‌నే అర్థం. వ‌చ్చే సోమ‌వారం వ‌ర‌కూ మిగిలే ఏ సినిమా అయినా ఫ‌ర్వాలేద‌ని ఆరోజు నిర్ణ‌యించుకోవాలి. అప్ప‌టివ‌ర‌కూ ఆడాల‌నే కోరుకుందాం.

User Comments