మంట‌ల్లో గాజువాక క‌న్య‌, శ్రీ‌క‌న్య

గాజువాక (విశాఖ‌) క‌న్య‌-శ్రీ‌క‌న్య థియేట‌ర్లు మంట‌ల్లో ద‌గ్ధ‌మ‌య్యాయి. దాదాపు 3కోట్ల మేర ఆస్తి న‌ష్టం సంభ‌వించింద‌ని య‌జ‌మానులు చెబుతున్నారు. థియేట‌ర్ల‌లోని ఫ‌ర్నిచ‌ర్‌, ప్రొజెక్ట‌ర్లు, ఏసీలు స‌మ‌స్థం త‌గ‌ల‌బ‌డ్డాయి. ప్ర‌స్తుతం థియేట‌ర్ లోప‌ల కేవ‌లం ఇనుప క‌మ్మీలు మిన‌హా వేరే ఏమీ క‌నిపించ‌డం లేదు. ప్ర‌మాద తీవ్ర‌త ప‌రాకాష్ట‌లో ఉంద‌ని ప్ర‌త్య‌క్ష సాక్ష్యులు చెబుతున్నారు.

ప్రారంభం థియేట‌ర్ పై క‌ప్పు నుంచి పొగ‌లు రావ‌డంతో అందులో ప‌ని చేసే ప‌నిమనిషి వెంట‌నే ఫోన్ చేసి మేనేజ‌ర్‌కి స‌మాచారం అందించింది. ఆ వెంట‌నే ఫైరింజ‌న్ల‌కు స‌మాచారం చేర‌వేశారు. అయితే అప్ప‌టికే జ‌ర‌గ‌కూడ‌ని ప్ర‌మాదం జ‌రిగిపోయింది. మంట‌ల్లో థియేట‌ర్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. దాదాపు 8 ఫైరింజ‌న్లు రెండు గంట‌ల పాటు శ్ర‌మించి మంట‌ల్ని చివ‌రికి అదుపులోకి తేగ‌లిగాయి. ప్ర‌స్తుతం ఘ‌ట‌న‌పై పోలీస్ విచార‌ణ సాగుతోంది. థియేట‌ర్‌కి అంటుకున్న క‌రెంట్ వైర్ల వ‌ల్ల షార్ట్ స‌ర్క్యూట్ సంభ‌వించింద‌ని థియేట‌ర్ మేనేప‌ర్ రామారావు చెబుతున్నారు. విశాఖ డీసీపీ ఫ‌కీర‌ప్ప ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ సాగిస్తున్నారు. ప్ర‌మాదం తెల్ల‌వారు ఝామున కావ‌డంతో ఎవ‌రూ ముందే గ్ర‌హించ‌లేక‌పోయారు. ఒక‌వేళ థియేట‌ర్‌లో జ‌నం ఉన్న‌ప్పుడు ఇది సంభ‌వించి ఉంటే పెద్ద ప్రాణ‌న‌ష్టం క‌లిగి ఉండేద‌ని అంతా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు.