గ‌రుడ‌వేగ‌.. ఈ మిష‌న్ పాజిబుల్లేనా..? 

ఒక‌ప్పుడు తెలుగు సినిమాను ఊపేసిన హీరోల్లో రాజ‌శేఖ‌ర్ కూడా ఒక‌రు. కానీ ఇప్పుడు ఈ హీరోను ప్రేక్ష‌కులు మ‌రిచిపోయి కూడా చాలా కాలమే అయింది. కానీ తాను ఇంకా ఉన్నాన‌ని గుర్తు చేయ‌డానికి వ‌స్తున్నాడు రాజ‌శేఖ‌ర్. హిట్లు ఉన్న‌పుడే ఇండ‌స్ట్రీలో ప‌ల‌క‌రింపులైనా.. ప‌ల‌వ‌రింత‌లైనా. కానీ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. రాజ‌శేఖ‌ర్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.
రాజ‌శేఖ‌ర్ అనే హీరో ఉన్నాడ‌నే విష‌యాన్నే ద‌ర్శ‌క నిర్మాత‌లు మ‌రిచిపోయారు. కానీ ఇప్ప‌టికీ గ‌తం గుర్తుంచుకుని ఓ ద‌ర్శ‌కుడు మాత్రం ఈయ‌న‌తో సాహ‌సం చేస్తున్నాడు. అత‌డే ప్ర‌వీణ్ స‌త్తార్. గ‌త ఏడాది గుంటూర్ టాకీస్ తో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌వీణ్ స‌త్తార్ పిఎస్వి గ‌రుడ‌వేగ 126.18 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వ‌రూపం ఫేమ్ పూజాకుమార్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది.
ఇందులో రాజ‌శేఖ‌ర్ సీక్రేట్ ఏజెంట్ గా న‌టిస్తున్నాడు. ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా సొంత నిర్మాణంలోనే సినిమాలు చేస్తోన్న రాజ‌శేఖ‌ర్.. చాలా ఏళ్ల త‌ర్వాత బ‌య‌టి నిర్మాత‌ల‌తో ప‌ని చేస్తున్నాడు. అయితే ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. గ‌రుడ‌వేగ‌ కోసం 25 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఫారెన్ షూటింగ్ లు.. స‌న్నీలియోన్ ఐటం సాంగ్.. హై టెక్నిక‌ల్ కెమెరాలు.. విదేశీ టెక్నీషియ‌న్లు.. అస‌లు ప్ర‌వీణ్ స‌త్తారు చేస్తున్న ర‌చ్చ మామూలుగా లేదు. ఇప్పుడు టీజ‌ర్ విడుద‌లైంది. ఈ టీజ‌ర్ చూస్తుంటే అస‌లు ఇందులో హీరో రాజ‌శేఖ‌రేనా..? ఈయ‌న‌తో ఇంత బ‌డ్జెట్ పెట్టారా అనే అనుమానం క‌లుగుతుంది. అలాంటిది ఆయ‌న సినిమా మీద ఇన్నేసి కోట్లు ఖ‌ర్చు చేస్తే ఏంటి ప‌రిస్థితి అంటున్నారు..? సినిమా ఎంత బాగున్నా ఇప్పుడు రాజ శేఖ‌ర్ ఉన్న ప‌రిస్థితుల్లో ఈ చిత్రం అన్ని కోట్లు వ‌సూలు చేస్తుందా..? ఏదేమైనా ఇప్పుడు గ‌రుడ‌వేగ మాత్రం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.