గాయ‌త్రి రివ్యూ

రివ్యూ: గాయ‌త్రి
న‌టీన‌టులు: మోహ‌న్ బాబు, విష్ణు, శ్రీ‌య‌, శివ‌ప్ర‌సాద్, నాగినీడు త‌దిత‌రులు
క‌థ‌నం: మోహ‌న్ బాబు
నిర్మాత‌: మోహ‌న్ బాబు
ద‌ర్శ‌కుడు: మ‌ద‌న్

గాయ‌త్రి.. చాలా రోజ‌లుగా ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. మోహ‌న్ బాబు నుంచి వ‌చ్చిన సినిమాల్లో చాలా కాలం త‌ర్వాత మంచి ఆస‌క్తితో వ‌చ్చిన సినిమా ఇది. మ‌రి గాయ‌త్రి అంచ‌నాలు అందుకుందా..?

క‌థ‌:
శివాజీ(మోహ‌న్ బాబు) స్టేజ్ ఆర్టిస్ట్. చిన్న‌ప్ప‌ట్నుంచీ న‌ట‌న అంటే ప్రాణం. బిడ్డ‌కు దూర‌మై అనాథ శ‌ర‌ణాల‌యాలను న‌డుపుతుంటాడు. వాటిని న‌డ‌ప‌డం కోసం చేయ‌ని నేరాల‌కు మారువేషాల్లో జైలుకు వెళ్తుంటాడు. వాళ్ల స్థానాల్లో న‌టిస్తుంటాడు. శివాజీ గుట్టు ర‌ట్టు చేయ‌డానికి జ‌ర్న‌లిస్ట్ శ్రేష్ట(అన‌సూయ‌) ఫాలో అవుతుంది. ఆమెకు దొర‌క్కుండా తిరుగుతుంటాడు శివాజీ. అనుకోని ప‌రిస్థితుల్లో ఓసారి శ్రేష్ట‌కు దొరికిపోతాడు శివాజీ. ఆ లోపు త‌ప్పిపోయింద‌నుకున్న త‌న కూతురు గాయ‌త్రి(నిఖిలా విమ‌ల్) గురించి తెలుసుకుంటాడు శివాజీ. పాతికేళ్ల త‌ర్వాత కూతుర్ని క‌లిసే స‌మ‌యానికి గాయ‌త్రి ప‌టేల్(మోహ‌న్ బాబు) శివాజీ జీవితంలోకి వ‌స్తాడు. శివాజీని కిడ్నాప్ చేస్తాడు. ఇంత‌కీ శార‌ద‌(శ్రీ‌య‌) ఎవ‌రు.. శివాజీతో ఆమెకేంటి సంబంధం..? ఎందుకు శివాజీని గాయ‌త్రి ప‌టేల్ కిడ్నాప్ చేస్తాడు అనేది మిగిలిన క‌థ‌.

క‌థనం:

మోహ‌న్ బాబు నుంచి సినిమా వ‌చ్చి చాలా కాల‌మైంది. ఈయ‌న సినిమాల‌ను ప‌ట్టించుకోవ‌డం కూడా మానేసారు ప్రేక్ష‌కులు. రొటీన్ క‌థ‌లు చేయ‌డం కంటే టైమ్ గ్యాప్ తీసుకుని రావ‌డం న‌యం అని మోహ‌న్ బాబు చాలా కాలం త‌ర్వాత చేసిన సినిమా గాయ‌త్రి. పైగా ఈ చిత్రానికి ఆయ‌నే స్క్రీన్ ప్లే కూడా అందించాడు. మ‌ళ‌యాలంలో వ‌చ్చిన ఓ క‌థ‌ను తీసుకుని.. ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు మార్చాడు మ‌ద‌న్. తొలి సీన్ నుంచి క‌థ‌లో మోహ‌న్ బాబు త‌ప్ప మ‌రెవ‌రూ క‌నిపించ‌రు. ఈ ఏజ్ లోనూ ఫైట్స్ కోరుకున్నాడు మోహ‌న్ బాబు. ఫైట్స్ కోస‌మే సీన్స్ రాసుకున్నాడు. తొలి ఫైట్ కోసం ఓ రౌడీ గ్యాంగ్ వ‌చ్చి అనాథ శ‌ర‌ణాల‌యాన్ని క‌బ్జా చేస్తారు. దాన్ని విడిపించ‌డానికి క‌లెక్ష‌న్ కింగ్ ఫైట్ సీక్వెన్స్. అక్క‌డ భూసేక‌ర‌ణ పేరుతో రాజ‌కీయ నాయ‌కుల‌పై సెటైర్లు.
ఇలా గాయ‌త్రిలో చాలా సీన్లు కావాల‌నే పెట్టిన‌వి క‌నిపిస్తాయి. క‌థ‌తో సంబంధం లేని సీన్స్ కూడా వ‌స్తాయి. క‌థ లేక‌పోవ‌డంతో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సాగ‌తీత య‌వ్వార‌మే క‌నిపిస్తుంది. ఇంట‌ర్వెల్ లో శివాజీ బ్యాక్ డ్రాప్ తో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. శ్రీ‌య‌తో విష్ణు బ్యాక్ డ్రాప్ సినిమాకు పెద్ద‌గా హెల్ప్ కాలేదు. ఇదంతా చాలా సినిమాల్లో చూసిన‌ట్లుగానే అనిపించింది. గాయ‌త్రి ప‌టేల్ ఎంట్రీతో క‌థ‌లో కాస్త ఆస‌క్తి పెరిగిపోతుంది. విల‌న్ గా గాయ‌త్రి ప‌టేల్ చుట్టూ న‌డిచే సీన్స్ ఆస‌క్తి పెంచేస్తాయి. మ‌రోవైపు కూతురు సెంటిమెంట్ పై కూడా దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. సెకండాఫ్ లో గాయ‌త్రి ప‌టేల్, శివాజీ మ‌ధ్య జ‌రిగే సీన్స్ సినిమాపై ఆస‌క్తి పెంచేసాయి. క్లైమాక్స్ లో హీరో విల‌న్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ చాలా బాగా రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. చివ‌ర్లో వ‌చ్చే జైల్ ఫైట్ సీక్వెన్స్ బాగుంది.

న‌టీన‌టులు:
మోహ‌న్ బాబు న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పేదేం లేదు. ఈయ‌న న‌టుడిగా 560 సినిమాలు చేసాడు. ఇప్పుడు కొత్త‌గా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. గాయ‌త్రి ప‌టేల్ గా విశ్వ‌రూపం చూపించాడు. యంగ్ మోహ‌న్ బాబుగా విష్ణు న‌టించాడు. కాక‌పోతే ఈ పాత్ర‌కు ఆయ‌న స‌రిపోలేదేమో అనిపించింది. ఇక శ్రీ‌య ప‌ర్లేదు. శివాజీ కూతురు గాయ‌త్రిగా నిఖిలా విమ‌ల్ చాలా బాగా న‌టించింది. ఆమెకు మంచి పాత్ర ప‌డింది. ఇక జ‌ర్న‌లిస్ట్ గా అన‌సూయ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నిక‌ల్ టీం:
థ‌మ‌న్ సంగీతం ప‌ర్లేద‌నిపించాడు. ఒక‌నువ్వు ఒక‌నేను పాట బాగుంది. విజువ‌ల్ గా కూడా చాలా బాగా తెర‌కెక్కించాడు మ‌ద‌న్. ఇక స‌ర్వేష్ మురారి సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. రీమేక్ క‌థ‌నే తీసుకుని తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్లు మార్చాడు మ‌ద‌న్. స్క్రీన్ ప్లే సాయం మోహ‌న్ బాబు కూడా చేసాడు. కానీ అది అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌లేదు. సెకండాఫ్ ప‌ర్లేదు అనిపించినా.. ఫ‌స్టాఫ్ మాత్రం తేలిపోయింది.

చివ‌ర‌గా:
గాయ‌త్రి.. మోహ‌న్ బాబు అభిమానుల‌కు మాత్ర‌మే..

రేటింగ్: 2.75/5

User Comments