జెనీలియాకు మెగా ఆఫ‌ర్

హ‌హా.. హాసిని మ‌ర్చిపోలేని పేరు ఇది. `బొమ్మ‌రిల్లు` సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రికీ తీయ‌ని త‌ల‌పు అనే చెప్పాలి. క‌ల్మ‌షం లేని అమ్మాయిగా హాసిని పాత్ర‌లో జెనీలియా ప‌లికించిన‌ హావ‌భావాలు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచాయి. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి బాలీవుడ్ హీరో, చిన్నినాటి స్నేహితుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లాడ‌ని జెనీలియా ఆ త‌రువాత సినిమాల‌కు దూర‌మైంది. గృహిణిగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చి సంతోషంగా గ‌డుపుతోంది.

ఇటీవ‌ల ఆమెని మ‌ళ్లీ తెర‌పైకి తీసుకురావాల‌నే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని జెనీలియా ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఇందు కోసం ప్ర‌త్యేకంగా ఫొటోషూట్ ని కూడా నిర్వ‌హించి ఆ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా ఇన్‌స్టా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చినా ఎక్క‌డా వ‌న్నెల‌ర‌గ‌ని అందంతో జెనీలియా మ‌రింత గ్లామ‌ర‌స్‌గా క‌నిపించ‌డంతో ఆమెపై ద‌క్షిణాది మేక‌ర్స్ క‌న్ను ప‌డింది. చిరంజీవి న‌టిస్తున్న 152వ చిత్రం ద్వారా జెనీలియాను మ‌ళ్లీ తెలుగు రీఎంట్రీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని నిరంజ‌న్‌రెడ్డితో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే జెనీలియాతో చిత్ర బృందం సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్‌గా జెనీలియాను ఒంప్పించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. డీల్ ఫైన‌ల్ అయితే హ‌హా.. హాసిని మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వ‌డం లాంఛ‌న‌మే.