జార్జిరెడ్డి మూవీ రివ్యూ

న‌టీన‌టులు: స‌ందీప్ మాధ‌వ్ (సాండీ), స‌త్య‌దేవ్, చైత‌న్య‌కృష్ణ త‌దిత‌రులు
సంగీతం:  సురేష్ బొబ్బిలి
కెమెరా:  సుధాక‌ర్ ఎక్కంటి
నిర్మాత‌లు: అప్పిరెడ్డి-సంజ‌య్ రెడ్డి
రిలీజ్ తేదీ: 22 న‌వంబ‌ర్ 2019
ద‌ర్శ‌క‌త్వం:  `ద‌ళం`ఫేం జీవ‌న్ రెడ్డి

ముందు మాట‌:
ఉస్మానియా రెబ‌ల్ స్టూడెంట్ .. గోల్డ్ మెడ‌లిస్ట్ జార్జిరెడ్డి హ‌త్యోదంతం నేప‌థ్యంలో బ‌యోపిక్ కేట‌గిరీలో తెర‌కెక్కిన `జార్జిరెడ్డి` చిత్రానికి సంబంధించిన ప్ర‌తి వార్తా మీడియాలో ప్ర‌ధానంగా హైలైట్ కావ‌డంతో అస‌లు ఆయ‌న జీవితంలో రెబ‌లిజం ఎంత‌.. రౌడీయిజం ఎంత‌? అన్న‌ది తెలుసుకోవాల‌న్న ఉత్సుక‌త ఆడియెన్ లో పెరిగింది. టీజ‌ర్ – ట్రైల‌ర్ లో ఉద్య‌మాలు ఎమోష‌న్ ఆక‌ట్టుకోవ‌డంతో దీనిపై సినీరాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి పెరిగింది. మెగా బ్ర‌ద‌ర్స్ చిరు-ప‌వ‌న్-నాగ‌బాబు త్ర‌యం స‌పోర్ట్ చేసి ప్ర‌చారం చేయ‌డంతో మ‌రింత ఉత్సాహం పెరిగింది. అయితే ఇంత హ‌డావుడి చేసిన  ఈ సినిమాలో నిజంగానే అంత మ్యాట‌ర్ ఉందా? అస‌లు వాస్త‌వంగా థియేట‌ర్ లో ఆడియెన్ ఫీలింగ్ ఏమిటి? అన్న‌ది తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

సింగిల్ లైన్‌:
జార్జిరెడ్డి (సాండీ) అన్యాయాన్ని ఎదురించే ఆవేశ‌ప‌రుడు. చిన్నతనం నుండి అత‌డికి ఆవేశ‌ప‌రుడ‌నే పేరుంది. హైద‌రాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాక అత‌డు విప్లవ‌ విద్యార్థి నాయకుడుగా ఎదుగుతాడు. ఒక సాధాసీదా స్టూడెంట్ గా వచ్చిన జార్జిరెడ్డి నాయకుడుగా ఎలా మారాడు? క్యాంపస్‌ సమస్యలపై ఎలా పోరాడాడు? ఆ క్రమంలో ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి?  కాలేజ్ స‌మ‌స్య‌ల‌తో ముడిప‌డిన రాజ‌కీయాలు జార్జ్ కి ఎలాంటి చిక్కులు తెచ్చాయి?  చివ‌రికి జార్జిరెడ్డిని హ‌త్య చేయ‌డానికి కార‌ణాలేమిటి..?  చేసినది ఎవ‌రు? ఇందులోనే కుల‌రాజ‌కీయాలు ఏమిటి? ఇవ‌న్నీ తెర‌పై చూడాల్సిందే.

క‌థా క‌మామీషు:

ఆద‌ర్శ భావాలున్న ఒక విద్యార్థి కాలేజ్ లో అంచెలంచెలుగా సూప‌ర్ ప‌వ‌ర్ గా ఎదిగి చివ‌రికి విప్ల‌వ‌ నాయ‌కుడిగా ఏం చేశాడు? శ‌త్రుత్వం పెర‌గ‌డానికి దారి తీసిన ప‌రిణామాలు ఏమిటి?  నాయ‌కుడి శాడ్ ఎండింగ్ వెనక రీజ‌న్ ఎలాంటిది? అన్న అద్భుత‌మైన క‌థ‌ను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు జీవ‌న్ రెడ్డి ఈ సినిమాలో కొంత స‌క్సెసైనా సెకండాఫ్ లో చేసిన కొన్ని త‌ప్పుల‌కు తీవ్ర‌ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. కాలేజ్ రాజ‌కీయాలు.. కుల రాజ‌కీయాలు వ‌గైరా వ‌గైరా అంశాల్ని అద్భుతంగా డీల్ చేసి ఇంట‌ర్వ‌ల్ బ్లాక్ ని అద్భుతంగా తీర్చిదిద్ది.. సెకండాఫ్ లో ల్యాగ్ తో.. చుట్టేయ‌డం నీర‌సం తెప్పిస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఏదైనా మ్యాజిక్ చేస్తాడ‌ని భావిస్తే అక్క‌డా నీర‌స‌ప‌డేలా చేయ‌డం ఈ సినిమాకి మైన‌స్ గా మారింది.
దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా ఎదిగి.. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన జార్జిరెడ్డి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు జీవన్ రెడ్డి కొంత‌వ‌ర‌కూ మాత్ర‌మే స‌క్సెస‌య్యారు. నాటి సామాజిక‌, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం బావుంది. స‌మ‌స‌మాజ స్థాప‌న ధ్యేయం ఆక‌ట్టుకుంది. జార్జిరెడ్డి పాత్ర‌ను తీర్చిదిద్దిన విధానం ఆక‌ట్టుకుంది. ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేసే సన్నివేశం.. జార్జ్ కి మంచి జాబ్ అవకాశం వచ్చినా తన నమ్మిన సిద్దాంతం కోసం దానిని వ‌దులుకోవ‌డం ప్ర‌తిదీ ఎమోష‌న‌ల్ గా ఆవిష్క‌రించాడు. కీల‌క‌మైన పాత్ర‌ల్నిటినీ చ‌క్క‌గా తీర్చిదిద్దారు.

అయితే చేసిన త‌ప్పులు ఎక్క‌డ‌? అంటే .. నేరేష‌న్ లో స్లో ఫేజ్.. చ‌ప్ప‌గా సాగే స్క్రీన్ ప్లేనే పెద్ద స‌మ‌స్య అయ్యింది. ఇక ఇందులో స‌రైన ఫ్లో లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది. సెకండాఫ్ లో టేకాఫ్ చేయ‌డంలోనే ద‌ర్శ‌కుడు మిస్ ఫైర్ అయ్యారు.

న‌టీన‌టులు:
విప్ల‌వంతో స‌హ‌జీవ‌నం అంటే ఆషామాషీ కాదు. ఒక విప్ల‌వ‌కారుడి పాత్ర‌లో అందునా జార్జిరెడ్డి అనే కాలేజ్ విద్యార్థి పాత్రలో కనిపించిన సందీప్ అలియాస్ సాండీ అద్భుతంగా పాత్ర‌లోకి ఒదిగిపోయి న‌టించాడు.
జార్జి రెడ్డి పాత్రలోని ఆవేశాన్ని విప్లవాన్ని .. రెబ‌ల్ స్టైల్ ను తన హావభావాలతో చక్కగా పలికించాడు. కీలక పాత్రలో కనిపించిన సత్య దేవ్ .. మరాఠీ నటి దేవిక పాత్ర‌లు ఆక‌ట్టుకున్నాయి. మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, తిరువీర్, అభయ్, ముస్కాన్ డీసెంట్ ప్ర‌ద‌ర్శ‌న మెప్పించింది. హీరో స్నేహితుల పాత్ర‌ల్ని జీవ‌న్ చ‌క్క‌గానే తీర్చిదిద్దాడు.  అయితే నీర‌సం తెప్పించే స్క్రీన్ ప్లే సెకండాఫ్ త‌ప్పులు న‌టీన‌టుల ప్రాభ‌వాన్ని దెబ్బ కొట్టాయి.

టెక్నికాలిటీస్:
సాంకేతికంగా అత్యున్న‌త చిత్ర‌మిది. సురేష్ బొబ్బిలి సంగీతం- బీజీఎం వండ‌ర్. సుధాక‌ర్ ఎక్కంటి సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ప్ల‌స్. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. డైలాగ్స్ చ‌క్క‌గా కుదిరాయి. ఇక యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఫైర్ బాల్ ఫైట్.. బ్లేడ్స్ తో రెయిన్ ఫైట్ ఎక్స‌లెంట్. నిర్మాణ విలువ‌లు అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ప‌ర్ఫెక్ట్ గా కుదిరాయి.

ప్లస్ పాయింట్స్ :

*ఎంచుకున్న క‌థ‌
* జార్జిరెడ్డి పాత్రలో సందీప్ న‌ట‌న‌
* కాలేజ్ ఎపిసోడ్స్.. ఫైట్స్.. ఎమోషనల్ సీన్స్
* పాత్ర‌లు – డైలాగ్స్ తీర్చిదిద్దిన విధానం

మైనస్ పాయింట్స్ :

* నేరేష‌న్ లో బోరింగ్ ట్రీట్మెంట్
* నెమ్మ‌దిగా సాగే సెకెండ్ హాఫ్
* క్లైమాక్స్ ఫెయిల‌వ్వ‌డం

ముగింపు:
జార్జిరెడ్డి రెబ‌లిజం ఓకే.. నేరేష‌న్‌లో హీరోయిజం ఫెయిల్

రేటింగ్‌:
2.5/5