గోదారి త‌ల్లి మైల ప‌డిందా?

గోదావ‌రి త‌ల్లి మైల‌ ప‌డిందా? అంటే అవున‌నే అంటున్నారు లంక గ్రామాల ప్ర‌జ‌లు. ఈనెల 15న రాయ‌ల్ వ‌శిష్ట బోటు దేవీప‌ట్నం స‌మీపంలోని క‌చ్చులూరు వ‌ద్ద మునిగిపోన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొన్ని మృత‌దేహాలు ల‌భ్య‌మ‌వ్వ‌గా..ఇంకా బోటులో కొన్నిమృత‌దేహాలున్న‌ట్లు అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగి ఇప్ప‌టికే రోజులు గ‌డుస్తోంది. క‌చ్చులూరు ప్రాంత‌మంతా గోదావ‌రి నుంచి దుర్వాస‌న వ‌స్తోంది. గాలి వీస్తే దాదాపు కిలోమీట‌ర్ల దుర్వాస‌న వ‌స్తోంది. న‌ది పొడ‌వున గంట‌కు 90 కిమీల మేర గాలి వీస్తోంది. దీంతో లంక గ్రామాల ప్ర‌జ‌లు వాస‌న భ‌రించ‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. వెంట‌నే మృత‌దేహాలు వెలికి తీయాల‌ని అధికారుల‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. బోటు వెలికి తీయ‌డంపై రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి అన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో స్థానిక‌ల ఒత్తిడి మరింత ఎక్కువైంది.

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భారీ ఎత్తున మృత దేహాలు గోదావ‌రిలో ఉండిపోవ‌డంతో స్థానికులు గోదావ‌రి మైలు ప‌డింద‌ని భావిస్తున్నారు. దీంతో గోదావ‌రి నీటిని బోటు మునిగిన నాటి నుంచి వాడ‌టం లేదు. స్థానికులు తాగు నీటికి గోదావ‌రి నీటిని విరివిగా వాడ‌తారు. గోదావ‌రి న‌ది ఒడ్డున చెరువులు ఏర్పాటు చేసుకుని మంచినీటిని సేక‌రిస్తారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థుల్లో వాట‌ర్ ప్యాకెట్ల‌తో గొంతు త‌డుపుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. అలాగే గోదావ‌రి ఒడ్డున దేవాల‌యాల్లో పూజ‌లు నిలిపివేసారు. వ‌ర్షాకాలంలో గోదావ‌రి వ‌స్తుందంటే ప‌సుపు, కుంకుమ , కొబ్బ‌రి కాయ‌లు కొట్టి గోదావ‌రి ఆహ్వానం ప‌ల‌క‌డం కొన్ని ద‌శాబ్ధాలుగా వ‌స్తోన్న ఆచారం. కానీ తాజాగా మైలు ప‌డింద‌ని భావించి గోదావ‌రిని ముట్టుకోవ‌డం లేదు. మృత దేహాలు వెలికితీత త‌ర్వాత మైలు మాపుకుని మ‌ళ్లీ త‌మ పూజ‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. అయితే అధికారులు మాత్రం మూఢ న‌మ్మ‌కాలతో వ్య‌వ‌రించొద్ద‌ని, నీరు కాలుష్యం అవ్వ‌లేద‌ని అవ‌స‌ర‌మైతే నీటిని టెస్టింగ్ పంపించి సందేహాల‌ను తీరుస్తామ‌ని అంటున్నారు.