ప్ర‌ముఖ న‌టుడు గొల్ల‌పూడి మారుతీరావు ఇక‌లేరు

ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నై లైఫ్‌లైన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మృతిపట్ల టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు తీవ్ర సంతాపం తెలిపారు.

గొల్ల‌పూడి1939 లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో విజ‌య‌న‌గ‌రంలో జ‌న్మించారు. అన్న‌పూర్ణ , సుబ్బారావుల‌కు గొల్ల‌పూడి ఐద‌వ సంతానం. మారుతి రావు వివాహం 1961 న‌వంబ‌ర్ 11న శివ‌కామ‌సుంద‌రితో హ‌నుమ‌కొండ‌లో జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఐదుగురు సంతానం. సంపాద‌కుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టి మాట‌ల ర‌చ‌యిత‌గా సినీ రంగంపైనా, వ్యాఖ్య‌త‌గా బుల్లి తెర‌పైనా ముద్ర వేశారు. చిరంజీవి క‌థానాయుకుడిగా న‌టించిన ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాల్లో న‌టించి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌కు విశాఖ‌ప‌ట్ణ‌ణం అంటే ఎంతో ఇష్ట‌మైన న‌గ‌రం. ప్ర‌తీ రోజు సాయం కాల స‌మ‌యంలో ఆర్ కె. బీచ్ ఒడ్డున భార్య‌తో క‌లిసి కూర్చునే వారు.