గోల్ మాల్.. ఇది ప‌క్కా హిట్ మాల్..

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు బాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది. ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమా వ‌చ్చినా 100 కోట్ల మార్క్ అందుకోడానికి వారం ప‌ట్టింది. కానీ ఒక‌ప్పుడు వంద కోట్ల కోసం మూడు రోజులు మాత్ర‌మే తీసుకునేది బాలీవుడ్. బాహుబ‌లి 2 త‌ర్వాత ఎందుకో బాలీవుడ్ కు శాపం పెట్టారు ఎవ‌రో..? అందుకే ఏ సినిమా వ‌చ్చినా ఫ్లాప్ అనే మాట త‌ప్ప మ‌రోటి వినిపించ‌ట్లేదు.

మ‌ళ్లీ బాలీవుడ్ కు మంచి రోజులు ఎప్పుడొస్తాయో అనుకుంటున్న త‌రుణంలో గోల్ మాల్ అగైన్ వ‌చ్చింది. ఈ చిత్రం తొలిరోజు ఏకంగా 32 కోట్లు వ‌సూలు చేసింది. ఈ మ‌ధ్య కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకు రాని రికార్డ్ ఇది. బాహుబ‌లి 2 ఈ విష‌యంలో అంద‌రికంటే ముందున్నది. దీనికి తొలిరోజే 45 కోట్లు వ‌చ్చింది. ఇప్పుడు రోహిత్ శెట్టి సినిమా గోల్ మాల్ అగైన్ కుమ్మేస్తుంది. 2006లో తొలిసారి గోల్ మాల్ సినిమా తెర‌కెక్కించాడు రోహిత్ శెట్టి.

ఈ గోల్ మాల్ కామెడీ సినిమాల చ‌రిత్ర‌లో కొత్త ట్రెండ్ కు తెర‌తీసింది. అజ‌య్ దేవ్ గ‌న్ హీరోగా రోహిత్ శెట్టి తెర‌కెక్కించాడు ఈ చిత్రాన్ని. ఆ త‌ర్వాత గోల్ మాల్ రిట‌ర్న్స్.. గోల్ మాల్ 3 పేరుతో రెండు సీక్వెల్స్ చేసాడు రోహిత్ శెట్టి. ఇవి కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు గోల్ మాల్ అగైన్ అంటూ మ‌ళ్లీ వ‌చ్చేసారు ఈ జోడీ.

గోల్ మాల్ సిరీస్ త‌ర్వాత అజ‌య్ దేవ్ గ‌న్ కు స‌రైన హిట్ లేదు. ఈ మ‌ధ్య వ‌ర‌స అపజయాలను చూసిన అజ‌య్ దేవ్ గ‌న్.. హిట్ కోసం మ‌రోసారి త‌న పాత స్నేహితున్నే న‌మ్ముకున్నాడు. ఇక్క‌డ రోహిత్ శెట్టి కూడా ఈ మ‌ధ్యే దిల్ వాలేతో దిమ్మ‌తిరిగే ఫ్లాప్ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటు రోహిత్ శెట్టి.. అటు అజయ్ దేవ్ గ‌న్ స‌రైన టైమ్ లో గోల్ మాల్ అగైన్ తో హిట్ కొట్టారు. రెండో రోజు కూడా 28 కోట్లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. గోల్ మాల్ అగైన్ ఈజీగా ఫుల్ ర‌న్లో 300 కోట్ల మార్క్ అందుకునేలా క‌నిపిస్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ దాటేసింది గోల్ మాల్ అగైన్.