నెల ముందే గోల్ మాల్ ఏంది గురూ..!

ఈ రోజుల్లో ఓ సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నా కూడా టికెట్ బుకింగ్స్ మాత్రం వారం రోజుల ముందు ఓపెన్ అవుతాయి. మ‌రీ పెద్ద హీరో అయితే రెండు వారాల ముందు ఓపెన్ అవుతాయి. నెల ముందు అయితే ఓపెన్ చేయ‌రు. ఒక‌వేళ చేసినా అది ప‌బ్లిసిటీ స్టంట్ కోసం చేసిన‌ట్లే. ఇప్పుడు గోల్ మాల్ అగైన్ టీం ఇదే చేస్తున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 20న విడుద‌ల కానుంది. కానీ సెప్టెంబ‌ర్ 20 నుంచే బుకింగ్స్ ఓపెన్ చేసారు. అస‌లు ప్రేక్ష‌కులు టికెట్స్ కొంటున్నారా లేదా అనేది అన‌వ‌స‌రం. కానీ బుకింగ్స్ మాత్రం నెల ముందే ఓపెన్ చేసారు. ఇంకా విడుద‌ల‌కు రెండు వారాలే టైమ్ ఉండ‌టంతో ప్ర‌మోష‌న్ లోనూ వేగం పెంచేసారు చిత్ర‌యూనిట్. గోల్ మాల్.. గోల్ మాల్ రిట‌ర్న్స్.. గోల్ మాల్ 3 విజ‌యాల త‌ర్వాత గోల్ మాల్ అగైన్ చేస్తున్నాడు రోహిత్ శెట్టి.
ఈ సారి దెయ్యం క‌హానీని చెప్ప‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. ఓ మ‌హ‌ల్ లోకి వెళ్లి అక్క‌డ దెయ్యంతో ఎలాంటి పాట్లు ప‌డ్డారు అనేది గోల్ మాల్ అగైన్ క‌థ‌. ఈ సారి కూడా కామెడీని ఫుల్లుగా పెట్టాడు రోహిత్ శెట్టి. గోల్ మాల్ సిరీస్ త‌ర్వాత అజ‌య్ దేవ్ గ‌న్ కు ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేదు. ఆ మ‌ధ్య వ‌ర‌స విజ‌యాల‌తో జోరు చూపించిన అజ‌య్ దేవ్ గ‌న్.. హిట్ కోసం మ‌రోసారి త‌న పాత స్నేహితున్నే న‌మ్ముకున్నాడు. ఇక్క‌డ రోహిత్ శెట్టి కూడా ఈ మ‌ధ్యే దిల్ వాలేతో దిమ్మ‌తిరిగే ఫ్లాప్ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇటు రోహిత్ శెట్టి.. అటు అజయ్ దేవ్ గ‌న్ కు గోల్ మాల్ అగైన్ విజ‌యం కీల‌కం. ప‌రిణీతి చోప్రా, ట‌బు గోల్ మాల్ అగైన్ లో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మొత్తానికి చూడాలిక‌.. నెల ముందు బుకింగ్స్ ఓపెన్ అయిన ఈ చిత్రం ఓపెనింగ్స్ ఎలా ఉండ‌బోతున్నాయో..?