వావ్.. 29 ఏళ్ళ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా!

బాలీవుడ్ నుంచి ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న ఓ సినిమా ఇప్పుడు దేశం మొత్తానికి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయింది. ఎందుకంటే, ఆ సినిమా ఇప్పుడు కాదు.. 29 ఏళ్ళ క్రితం అంటే 1988 లో తెరకెక్కింది కాబట్టి. అది కూడా ప్రముఖ రచయిత, దర్శకుడు గుల్జార్ తెరకెక్కించిన ‘లిబాస్’ అనే సినిమా కావడంతో.. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కు కూడా ఈ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదిలా ఉంటే, అప్పుడెప్పుడో తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడు గుల్జార్ కు – నిర్మాత వికాస్ మోహన్ కు మధ్య తలెత్తిన వివాదం కారణంగానే రిలీజ్ కాకుండా ఆగిపోయిందని సమాచారం.

ముఖ్యంగా సినిమా ముగింపు తనకు నచ్చలేదని, దానిని మార్చాల్సిందేనని వికాస్ మోహన్ డైరెక్టర్ గుల్జార్ ను కోరితే.. ఆయన అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కోపంతో తాను ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రసక్తే లేదంటూ మొండికేసిన వికాస్ మోహన్ సినిమాను ఓ మూలాన పడేశారని అంటూ ఉంటారు. అయితే, ఏళ్ళు గడిచిపోయాక చివరకు వికాస్ మోహన్ 2016 లో మరణించడం.. అనంతరం ఆయన స్థానంలో సినిమా నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆయన కొడుకు అముల్ మోహన్ ఇప్పుడు ‘లిబాస్’ ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు తాజాగా జీ క్లాసిక్ తో కలిసి ‘లిబాస్’ ను ఈ ఏడాదిలోనే సాధ్యమైనంత తొందరగా రిలీజ్ చేస్తామని ప్రకటించడం విశేషం.

ఇకపోతే, లిబాస్ సినిమా గుల్జార్ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కార్లా రాసిన ‘సీమ’ అనే చిన్న కథ ఆధారంగా తెరకెక్కగా.. ఇందులో సీమ గా అలనాటి తార షబానా ఆజ్మీ, ఆమె భర్తగా ప్రఖ్యాత నటుడు నసీరుద్దీన్ షా నటించడం జరిగింది. ఇక కథలో భాగంగా షబానా తన బాల్య మిత్రుడు టీకే పాత్రధారి రాజ్ బబ్బర్ తో వెళ్లిపోవడంతో ఆమె వైవాహిక జీవితం దెబ్బతిని.. ఆ నేపథ్యంలో ముగ్గురి పాత్రలు మనస్సును హత్తుకునేలా ఉండటమే కాకుండా, మనస్సును కట్టిపడేసే కథాకథనాలతో సినిమా సాగుతుందని చెబుతున్నారు. అందుకే ఈ సినిమా పూర్తయిన నాలుగేళ్ళ తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తే ప్రశంసలు దక్కడమే కాకుండా.. సినిమాకు సంగీతం వహించిన ఆర్డీ బర్మన్ పాటలకు ఆహుతులు ఫిదా అయిపోయారని చెప్పుకుంటున్నారు. మరి అలాంటి సినిమా అప్పుడు రిలీజ్ అవకుండా ఇన్నాళ్లకు ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే, అది నిజంగా విశేషమనే అనాలి.