గుణ‌శేఖ‌ర్: ఇదే నా లాస్ట్ ప్రెస్ మీట్

ఓ ద‌ర్శ‌కుడికి ఎంత‌గా క‌డుపు మండితే ఇంత‌గా వ్య‌తిరేకంగా మాట్లాడ‌తాడు..? ఇప్పుడు గుణ‌శేఖ‌ర్ పై ఇండ‌స్ట్రీతో పాటు బ‌య‌ట కూడా వినిపిస్తున్న వార్త‌లివి. ఆయ‌న చేసిన రుద్ర‌మదేవిని క‌నీసం గుర్తించ‌క‌పోవ‌డంపై మ‌రోసారి మీడియాతో మాట్లాడాడు ఈ ద‌ర్శ‌కుడు. ముందుగా ఆర్జీవిపై తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మ‌ద్దినేని ర‌మేష్ చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించాడు గుణ‌శేఖ‌ర్. వ‌ర్మ అనే వ్య‌క్తి సెటైర్లు వేస్తుంటాడు.. అవ‌న్నీ మనం సీరియ‌స్ గా తీసుకుని ఫీల‌య్యేంత ప‌ని లేద‌ని.. అప్పల్రాజు సినిమా టైటిల్ సాంగ్ లో బోయపాటి వర్మ తనపై ఏం సెటైర్ వేశాడో తెలుసుకొని మరీ నవ్వుకొన్నాడని చెప్పాడు గుణ‌శేఖ‌ర్.

ఇక త‌న సినిమా ప‌న్ను మిన‌హాయింపు విష‌యంపై ప్ర‌భుత్వం చూపించిన వివ‌క్ష‌పై కూడా మాట్లాడాడు గుణ‌శేఖ‌ర్. కొంద‌రు రుద్ర‌మ‌దేవి రిలీజైన త‌ర్వాత తాను ట్యాక్స్ ఎగ్జెప్ష‌న్ కు అప్లై చేసుకున్నాన‌ని చెప్పార‌ని.. కానీ అది నిజం కాద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. 2015 న‌వంబ‌ర్ లో రుద్ర‌మదేవి ప‌న్ను మిన‌హాయింపు కోసం తాను అప్లై చేసాన‌ని.. అదే టైమ్ లో తెలంగాణ ప్ర‌భుత్వం స్పందించింద‌ని కానీ ఏపీ మాత్రం ఏమీ మాట్లాడలేద‌న్నాడు గుణ‌శేఖ‌ర్. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వంలో ఉన్న వాళ్ల‌తోనూ తాను మాట్లాడాన‌ని కానీ లాభం లేకపోయింది అని అన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. త‌న సినిమాపై ఓ క‌మిటీవేసి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అప్ప‌టి ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పినా అది జ‌ర‌గ‌లేద‌ని చెప్పాడు గుణ‌శేఖ‌ర్.

ఆ త‌ర్వాత వెళ్లి తాను అడిగితే ప్లేస్ లు మారుతున్నాం క‌దా.. ఫైల్స్ మార్చే ప‌నిలో బిజీగా ఉన్నాం అని స‌మాధానం చెప్పారు.. ఆ త‌ర్వాత శాత‌క‌ర్ణికి ట్యాక్స్ మిన‌హాయింపు ఇచ్చిన‌పుడు మంత్రి ఘంటా శ్రీ‌నివాస‌రావుకు త‌న విన్నపం చెప్పాన‌ని.. ఆయ‌న మీటింగ్ లో మాట్లాడి చెప్తాన‌న్నారు కానీ అప్పుడు కూడా త‌నకు ఫ‌లితం రాలేద‌ని చెప్పాడు గుణ‌శేఖ‌ర్. అంతేకాదు.. కొన్ని రోజుల త‌ర్వాత అడిగితే అప్పటి అధికారులు నీఫైల్ క్యాన్సిల్ అయింది.. క‌రెక్ట్ గా అప్లై చేయ‌లేద‌ని త‌న‌కే తిరిగి చెప్పార‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు అవార్డుల విష‌యంలోనూ త‌న సినిమాకు అన్యాయం జ‌రిగింద‌న్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ప్ర‌భుత్వం ఇచ్చిన అవార్డుల‌పై మాట్లాడితే.. త‌మ‌కు ఎందుకు రాలేద‌ని ప్ర‌శ్నిస్తే వాళ్ల‌ను మూడేళ్ల వ‌ర‌కు నంది అవార్డుల‌కు అన‌ర్హులుగా ప్ర‌క‌టించే కొత్త క్లాజ్ తీసుకొచ్చార‌ని చెప్పాడు గుణ‌శేఖ‌ర్. ఇది చాలా అన్యాయం అన్నాడు ఈ ద‌ర్శ‌కుడు. క‌నీసం ప్ర‌శ్నించ‌డం కూడా త‌ప్పేనా అంటున్నాడు ఈయ‌న‌. ఈ విష‌యంలో అవార్డులు రాని ఎంతోమంది కుర్ర ద‌ర్శ‌కులు.. టెక్నీషియ‌న్లు తనకి ఫోన్ చేసి వాళ్ళ బాధని షేర్ చేసుకొన్నారని చెప్పాడు గుణ‌శేఖ‌ర్. మొత్తానికి ఇప్పుడు త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఇప్పుడు బాధ ప‌డినా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం కూడా లేద‌ని.. కొంద‌రు ఈ స‌మ‌స్య‌కు ముగింపు ఇవ్వండి అని అడిగినందుకు మాత్ర‌మే తాను మీడియా ముందుకు వ‌చ్చాన‌ని చెప్పాడు గుణ‌శేఖ‌ర్. ఇక అవార్డుల విష‌యంలో ఇదే త‌న చివ‌రి ప్రెస్ మీట్ అని ఆయ‌న చెప్పారు.