ఈ బ‌ర్త్ డే వెంక‌టేష్ కి స్పెషల్

విజ‌యం కావాల‌ని హీరోలంతా కోరుకుంటారు.. కానీ విజ‌య‌మే ఆయ‌న ఇంటిపేరుగా మారిపోయింది. అత‌డు సినిమా చేస్తే హిట్ అనే న‌మ్మ‌కాన్ని ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌లిగించాడు.. నిర్మాతల త‌న‌యులు హీరోగా నిల‌బ‌డ‌రు అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సూప‌ర్ స్టార్ అయ్యాడు.. ఫ్యామిలీ హీరోగా శోభ‌న్ బాబు త‌ర్వాత అంత ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఇంత‌టి ఇమేజ్ తెచ్చుకున్న వెంక‌టేష్ పుట్టిన‌రోజు నేడు. డిసెంబ‌ర్ 13తో ఈయ‌న 57 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. రామానాయుడు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. స్టార్ హీరోగా ఎదిగాడు వెంక‌టేష్. నిర్మాత కొడుకు స్టార్ అవ్వ‌డం అప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌ర‌గ‌లేదు. కానీ ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాత అన్నీ మారాయి.

వ‌ర‌స విజ‌యాల‌తో ఇండ‌స్ట్రీకి జోరు నేర్పించాడు వెంక‌టేష్. తొలి సినిమ క‌లియుగ పాండ‌వులుతోనే సంచ‌ల‌నం సృష్టించ‌డంతో పాటు నంది అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు వెంక‌టేష్. ఆ త‌ర్వాత ఒంటరి పోరాటం.. స్వ‌ర్ణ‌క‌మ‌లం లాంటి సినిమాల‌తో 80వ ద‌శ‌కంలో స‌త్తా చూపించాడు. ఇక 90ల్లో వెంకీ జోరుకు బ్రేకులే లేకుండా పోయాయి. బొబ్బిలిరాజా.. చంటి.. ధ‌ర్మ‌చ‌క్రం.. ప్రేమించుకుందాం రా.. పెళ్లిచేసుకుందాం.. క‌లిసుందాం రా.. జ‌యం మ‌న‌దేరా.. మ‌ల్లీశ్వరి.. నువ్వు నాకు న‌చ్చావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకీ సాధించిన విజ‌యాలెన్నో. ఆయ‌న‌కు ఉన్నంత స‌క్సెస్ రేట్ తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌రే హీరోకు లేదు. అందుకే అభిమానులు కూడా అత‌న్ని విక్ట‌రీ వెంక‌టేష్ అంటారు.

రీమేక్ సినిమాలు చేయ‌డంలో కూడా వెంక‌టేష్ త‌న‌కు తానే సాటి. మ‌రీ ముఖ్యంగా త‌న‌కు సూట‌య్యే క‌థ‌ల‌ను మాత్ర‌మే ఎంచుకుంటూ రీమేక్ ల‌తో ర‌చ్చ చేసాడు వెంకీ. కుటుంబ క‌థాచిత్రాల‌కు ఇప్ప‌టికీ వెంక‌టేష్ మంచి ఛాయిస్. గ‌త కొన్నేళ్ల‌లో ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, సంక్రాంతి, దృశ్యం లాంటి సినిమాల‌తో త‌న‌దైన ముద్ర వేసాడు వెంక‌టేష్. ఈ మ‌ధ్య కాస్త జోరు త‌గ్గించినా కూడా ఇప్పుడు మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు వెంక‌టేష్. ప్ర‌స్తుతం తేజ‌తో పాటు త్రివిక్ర‌మ్ సినిమాకు కూడా క‌మిట‌య్యాడు వెంక‌టేష్. ఈయ‌న ఇలాంటి పుట్టిన‌రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని ఆశిద్ధాం..!