మేనేజ‌ర్ కి హీరో రాంరాం

ఆ హీరో కెరీర్ పూర్తి డైల‌మాలో ఉందిప్పుడు. ఈ నాలుగేళ్ల‌లో న‌టించిన‌ డ‌జ‌ను సినిమాలు ఆశించిన ఫ‌లితాన్నివ్వ‌లేదు. దాదాపుగా అన్నీ ఫ్లాపులే. దీంతో కెరీర్ పూర్తి డైల‌మాలో ప‌డిపోయింది. ఇక ఇది టేకాఫ్ అవుతుందా..అంటే క‌ష్ట‌మే. అయితే తాను చేస్తున్న త‌ప్పులేమిటో అత‌గాడు ప‌సిగ‌ట్టాడ‌ట‌.

దీనంత‌టికీ కార‌ణం త‌న‌ని త‌ప్పుదారి ప‌ట్టించ‌డ‌మేన‌ని గ్ర‌హించాడ‌ట‌. తాను ఎంచుకుంటున్న స్క్రిప్టుల‌తోనే ఉంది స‌మ‌స్య అని తెలిసొచ్చింది. అస‌లు త‌న‌వ‌ర‌కూ రాకుండానే మ‌ధ్య‌లో స్క్రిప్టులు వినేవాళ్ల చేత‌కాని త‌నం కూడా ఈ రివ్యూల్లో బ‌య‌ట‌ప‌డింది. దీంతో ఉన్న ఫ‌లంగా త‌న మేనేజ‌ర్ ను ప‌నిలోంచి పీకేశాడ‌ట స‌ద‌రు హీరో. ఇన్నాళ్లు చెత్త స్క్రిప్టులు విని వాటిని ప్ర‌మోట్ చేసిన స‌ద‌రు మేనేజ‌ర్ వ‌ల్ల‌నే త‌న కెరీర్ ఇలా అయ్యింద‌ని భావించి వెంట‌నే యాక్ష‌న్ తీసుకున్నాడ‌ట‌. అంతేకాదు.. స‌ద‌రు మేనేజ‌ర్ వ‌ల్ల ఓకే  అయిన వేరొక ప్రాజెక్టును కూడా క్యాన్సిల్ చేసుకోవ‌డం ప‌రిశ్ర‌మ‌లో చర్చకు వ‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో హీరోల మ్యానేజ‌ర్ల సైడు లీల‌ల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపిస్తున్నాయి. చేతివాటంలో రాటుదేలిన మేనేజ‌ర్లు కొన్నిసార్లు కాసుల‌కు కక్కుర్తి ప‌డి త‌మ ఉద్యోగానికే ఎస‌రు తెచ్చుకుంటున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. విష‌యం లేని చెత్త స్క్రిప్టుల్ని అభిరుచి లేని మేనేజ‌ర్లు ఓకే చేసేయ‌డం హీరోల పీక‌ల మీదికి వ‌స్తోంది. నాశిర‌కం .. ఛీటింగ్ ల‌క్ష‌ణాలు ఉన్న మేనేజ‌ర్ల వ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌దు. పైగా కెరీర్ ని న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంది. అందుకే ఇక‌పై స్క్రిప్టు ప‌ర‌మైన నాలెజ్ తో పాటు విశ్లేష‌ణా సామ‌ర్థ్యం ఉన్న మేనేజ‌ర్ ని స‌ద‌రు హీరో ఎంపిక చేసుకోనున్నాడ‌ని తెలుస్తోంది. ఇక‌పోతే ఆయ‌నకు ఎదురైన ఈ జీవిత పాఠం ఇత‌ర హీరోల‌కు అనుభ‌వ పాఠం కావాల‌ని భావిద్దాం.