డ్రగ్స్ కేసులో ఏ పరీక్షకైనా సిద్ధం – హీరో 

Hero Nandu clarifies regarding Drugs case
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీల పేర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేశారని, విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని హెచ్చరికలు పంపారని ప్రచారం జరుగుతోంది. దీంతో డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎవరి పేర్లైతే మీడియాలో తెగ తిరిగేస్తున్నాయో వాళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు.
ముందుగా ఈ డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని యంగ్ హీరో నందు కొంచెం గట్టిగానే చెబుతున్నాడు. ఈ సందర్బంగా తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదని, అలాంటిది మీడియాలో నా పేరు రావడం షాక్ కి గురి చేసిందని నందు తెలిపాడు. అలాగే అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. చివరగా ఈ విషయంలో ఏ పరీక్షకైనా తాను సిద్ధమని, డ్రగ్స్ కేసులో తనను ఇరికించే ఉద్దేశ్యంతోనే ఇదంతా చేసి ఉంటారని, మీడియా దయచేసి వాస్తవాలు తెలుసుకుని వెలుగులోకి తేవాలని హీరో నందు కోరడం జరిగింది.
ఇదిలా ఉంటే, మరో యంగ్ హీరో నవదీప్ కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంపై స్పందిస్తూ.. అధికారుల నుంచి నాకు నోటీసులు అందిన మాట వాస్తవమేనని, అయితే నేను ఏ తప్పు చేయలేదని, అయినా సరే అధికారులకు పూర్తిగా సహకరించి తానేంటో నిరూపించుకుంటానని తెలిపాడు. మరోవైపు, ఈ కేసులో తన పేరు కూడా వినిపిస్తుండటంపై ఆర్ట్ డైరెక్టర్ చిన్నా కూడా స్పందించారు. ముందుగా ఇలా డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు రావడం బాధ కలిగించిందని పేర్కొన్న చిన్నా.. టీవీల్లో నా పేరు చూసి షాక్ కు గురయ్యానని, డ్రగ్స్ వ్యవహారం గురించి నాకేమీ తెలియదని, అసలు తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు నిజంగా అందలేదని, ఈ విషయంలో తనపై వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. మరి ఈ లెక్కనే ఇప్పుడు మిగిలిన టాప్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్పందిస్తారేమో చూడాలి.