హీరో రాజశేఖర్ ఎస్.యు.వి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్ లోని అప్పా జంక్షన్ పరిసరాల్లో డివైడర్ ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం అందింది. అయితే ఈ ప్రమాదానికి కారణం మాత్రం టైర్ బరస్ట్ అవ్వడం వల్లనేనని తాజాగా జీవిత రాజశేఖర్ మీడియాకి వివరణ ఇచ్చారు.
అయితే ఇందులో నిజానిజాలేమిటి? అన్నదానిపై శంషాబాద్ పోలీస్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణాలు వేరేగా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక రాజశేఖర్ కార్ అతివేగం వల్లనే ప్రమాదానికి గురైందని.. అతడి కార్ లో మద్యం బాటిల్ లభించిందని పోలీసులు చెబుతున్నారు. ఆయన మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్లనే ఇలా జరిగిందని దీనిపై విచారణ సాగుతోందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్ 150 కి.మీల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ అతివేగం మరో కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని టీవీ చానెళ్లలో రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కేసులో నిజానిజాలేమిటి? అన్నది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది.