ఉద‌య్‌కిర‌ణ్‌లో ఆ చీక‌టి కోణం?

Last Updated on by

తేజ `ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌`పై ఆస‌క్తిగా ఉన్నారంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర ప్ర‌చారం సాగుతోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థ రాసుకునే స‌మ‌యంలో ఉద‌య్‌కిర‌ణ్‌పై సినిమా తీయాల‌న్న ఆలోచ‌న అత‌డికి త‌ట్టిందిట‌. అనుకున్న‌దే త‌డ‌వుగా దీనిపై సీరియ‌స్‌గా ఆలోచించ‌డం మొద‌లు పెట్టాడ‌ని తెలుస్తోంది. అయితే ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ అంటే పూర్తిగా వివాదాల‌తో ముడిప‌డిన‌ది అన‌డంలో సందేహం లేదు. జీవిత‌క‌థ అంటే ఎమోష‌న్‌తో కూడుకున్న‌ది అయ్యి ఉండాలి. ఉద‌య్ జీవితం వివాదాల‌తో కూడుకున్న ఎమోష‌న్‌ని పండించ‌గ‌ల‌దు. ఉద‌య్ జీవితంలో ఎంతో ఎమోష‌న్ ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఒక మామూలు టీనేజీ కుర్రాడు ఎలాంటి పొర‌పాట్లు చేస్తాడో అలాంటి పొర‌పాట్లు చేసిన ఉద‌య్‌… త‌న లైఫ్‌లో ఎంతో పెద్ద అవ‌కాశాన్ని కోల్పోవాల్సొచ్చింద‌న్న‌ది నిర్వివాదాంశం. గ‌తంగ‌తః. దివంగ‌తుడైన ఓ హీరో గురించి ఇలా త‌వ్వ‌డం ఎందుకు? అని అనుకోవ‌డానికి లేదిప్పుడు. తేజ .. ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్నాడు అన‌గానే, అంద‌రిలో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. ఓ ర‌కంగా చెప్పాలంటే కామ‌న్ ఆడియెన్ కంటే…మెగాభిమానుల్లో ఇంకా ఇంకా ఉత్కంఠ‌. మెగాస్టార్ చిరంజీవికి ఎంత‌మంది అభిమానులు ఉన్నారో, మెగా కాంపౌండ్ హీరోల‌కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అంద‌రికీ ఈ సినిమాపై ఎంతో క్యూరియాసిటీ నెల‌కొంటుంద‌న‌డంలో సందేహం లేదు.

ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణానికి స‌రిగ్గా కొన్ని నెల‌ల ముందు పుట్టిన‌రోజు ఇంట‌ర్వ్యూలో అత‌డు చెప్పిన కొన్ని నిజాలు ఎవ‌రికైనా కంట‌త‌డి పెట్టించ‌క మాన‌వు. నాడు `మై ఫ‌స్ట్ షో` జ‌ర్న‌లిస్ట్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు ఉద‌య్ ఇచ్చిన స‌మాధానం క‌డుపు త‌రుక్కుపోయేలా చేసింది. ఎదిగే క్ర‌మంలో మీరు తెలిసీతెలియ‌క చేసిన త‌ప్పులు కెరీర్ ప‌రంగా ఇబ్బంది పెట్టాయ‌ని మీరు రిగ్రెట్ ఫీల‌వుతున్నారా? అన్న ఓ ప‌రోక్ష‌ ప్ర‌శ్న‌కు… ఉద‌య్ ఇచ్చిన స‌మాధానం గుండె పిండేసింది నాడు. “టీనేజ‌ర్‌గా సినిమా అంటే పిచ్చిగా ఉండేవాడిని. ఆ ఉత్సాహంలో ఏం చేస్తున్నానో కూడా నాకే తెలిసేది కాదు. అనుకున్న ప్ర‌తిదీ చేసేశాను. ఏదైనా ఎదుర్కోగ‌ల‌న‌నే ధీమా ఉండేది. ఎంత‌వ‌ర‌కూ అయినా వెళ‌తాను గెలుపుకోసం!“ అంటూ ఎంతో ఉద్విగ్నంగా ఎమోష‌న‌ల్ అయ్యి ఆన్స‌ర్ ఇచ్చాడు. అప్ప‌టికి త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎన్నిటినో ఎదుర్కొన్నాడు. అత‌డి కెరీర్ పూర్తిగా డౌన్‌ఫాల్‌లో ఉంది. సుస్మిత‌తో నిశ్చితార్థం అనంత‌రం పెళ్లి ఆగిపోయింది. అలానే త‌న తండ్రితోనూ ఉద‌య్ అప్ప‌టికే విభేధించి దూరంగా ఉన్నాడ‌న్న ప్ర‌చారం ఉంది. ఏదేమైనా అంత చిన్న‌వయ‌సులో ఎన్నో చూడ‌డం…అత‌డిని ఉద్విగ్నుడిని చేసింది… ఆ సంద‌ర్భంలో అత‌డు ఎంతో ఎమోష‌న‌ల్ అవ్వ‌డం వెన‌క కార‌ణాలెన్నో. ఆ త‌ర‌వాత రిలీజైన `ఔన‌న్నా కాద‌న్నా` సినిమా ఫ‌లితం తెలిసిందే. తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో చ‌క‌చ‌కా కొన్ని త‌ప్పులు జ‌రిగిపోయిన మాట వాస్త‌వ‌మేన‌ని, అవేవీ తాను తెలిసే చేయ‌లేద‌ని నాడు ఉద‌య్ అంగీక‌రించాడు. విధి ఆడిన వింత నాట‌కంలో అత‌డు ఎంతో వేద‌న చెందాడ‌ని ఆ ఇంట‌ర్వ్యూలో ఆ ఎమోష‌న్ తేల్చి చెప్పింది. అది అస్స‌లు చీక‌టి కోణం కానేకాదు.. ఒక ఉద‌య‌తార ఆకాశంలో మిణుకుమినుకుమంటున్న దివ్య‌త్వం అనే చెప్పాలి.

User Comments