హీరోలకు బాత్రూమ్ లు వ‌స్తాయా!

RX 100 Sensation Begins New Project

హీరో అవ్వ‌డం అన్న‌ది 100 జ‌న్మ‌ల పుణ్య‌ఫ‌లం. మ‌హర్జాత‌కుడు అయితేనే .. హీరో ఛాన్స్ ద‌క్కుతుంది. అలాంటి జాత‌కం ఉన్న‌వాడే హీరో కార్తికేయ‌. 2018లో ఆర్.ఎక్స్ 100 చిత్రంతో ఆ పిలుపును అందుకున్నాడు. తొలి సినిమాతోనే బంప‌ర్ హిట్ కొట్టిన కార్తికేయ ఆ వెంట‌నే కెరియ‌ర్ ని తెలివిగా ప్లాన్ చేస్కున్నాడు. ఇప్ప‌టికే నాలుగు సినిమాల్లో న‌టిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. అందుకేనేమో నిన్న‌టి సాయంత్రం హిప్పీ ఆడియో వేడుక‌లో ఎంతో ఎమోష‌న్ అయ్యాడు. హీరోగా నెత్తిన పెట్టుకున్న ప్రేక్ష‌కాభిమానుల‌కు ప‌దే ప‌దే కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

కార్తికేయ ఎమోష‌న‌ల్ స్పీచ్ ఆద్యంతం క‌ట్టి ప‌డేసింది. తాను హీరో అవ్వ‌డం గురించి కార్తికేయ మాట్లాడుతూ.. “హీరో అయితే చాలు. నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని. హీరో కావాల‌ని చిన్న‌ప్ప‌ట్నుంచి క‌ల‌లు క‌న్నాను“ అని తెలిపారు. అస‌లు హీరోలు ఎలా ఉంటార‌బ్బా? వారికి బాత్ రూమ్‌లు వ‌స్తాయా? అనిపించేది. కానీ స‌డెన్‌గా న‌న్ను హీరో అంటుంటే .. మామూలు మ‌నిషినే క‌దా అనిపించింది. నేను ఇంత క‌ష్ట‌ప‌డితే ఎంతో ఇచ్చారు. మీ ప్రేమ‌ను చూశాను. అందుక‌నే ఇక‌పై ముందుకే వెళ‌తాను. కానీ వెన‌క్కి వెళ్ల‌లేను. అలా వెళ్ల‌కూడ‌ద‌నే `హిప్పీ` సినిమా సెల‌క్ట్ చేసుకున్నాను. ఒళ్లు ద‌గ్గర పెట్టుని ప‌నిచేస్తాను.. అంటూ అభిమానుల‌కు ప్రామిస్ చేశాడు కార్తికేయ‌. సినిమా ప‌రిభాష‌ను ప‌క్కాగా క్యాచీగా మాట్లాడేస్తూ ఈ న‌వ‌త‌రం హీరో ఆక‌ట్టుకుంటున్నాడు.

12 జూలై 2018.. నేను మ‌ళ్లీ పుట్టిన‌రోజు. నాకు పున‌ర్జ‌న్మ ద‌క్కిన రోజు. ఆరోజు `ఆర్‌.ఎక్స్ 100` విడుద‌లైంది. ఈ సినిమా లేక‌పోతే నేను లేను. కాబ‌ట్టి ఎన్ని సినిమాలు చేసినా నా తొలి సినిమా గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుతాను. నేను పుట్టి 11 నెల‌లు అయ్యింది. నా పుట్టుక‌ను అంద‌రూ సెల‌బ్రేట్ చేసుకున్నార‌ని ఎంతో ఎమోష‌న్ అయ్యాడు కార్తికేయ‌. ఒక చిన్న‌బాబులా న‌న్ను అంద‌రూ ధీవించార‌ని కార్తికేయ అన్నారు. త‌ల్లిదండ్రులు క‌న్న‌బిడ్డ‌ల‌పై చూపిన ప్రేమ‌ను నాపై చూపించార‌ని త‌న మేక‌ర్స్ ని పొగిడేశాడు. ఏదో సాధిస్తార‌ని గ‌ట్టిగా న‌మ్ముతారు. ఇంత ప్రేమ‌ను చూపిస్తున్న మీకు .. హిప్పీ సినిమాతో నా కొడుకు అవుతున్నాడ్రా అనిపిస్తాను అని అన్నారు. హిప్పీ క‌థ గురించి చెబుతూ.. ఆర్‌.ఎక్స్ 100 త‌ర్వాత నేను ల‌వ్ ఫెయిల్యూర్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయాను. ప్ర‌తి దానికి నేను సింబ‌ల్ అయిపోయాను. కానీ నేను మీరు కోరుకునే స్థాయికి వెళ్లాలంటే వైవిధ్య‌మైన‌ సినిమాలు చేయాలి. ఆర్‌.ఎక్స్ 100లో అమ్మాయి వ‌దిలేసిందని ఏడ్చిన నేను.. ఇక్క‌డ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో తిరుగుతూ ఫిలాస‌ఫీ చెబుతున్నాను. ప్ర‌తి అబ్బాయి అమ్మాయితో ఉన్న‌ప్పుడే మ‌రో అమ్మాయిని చూడాల‌నుకుంటాడు!! అంటూ హిప్పీ క‌థ‌ను లీక్ చేశాడు.