హృతిక్ లెక్క‌లు స్టార్ట్ చేసాడు

Last Updated on by

లెక్క‌ల మాస్టారు అంటే మ‌న‌కు ముందుగా గుర్తొచ్చేది సుకుమార్. ఎందుకంటే ఆయ‌న సినిమాల్లోకి రాక‌ముందు లెక్క‌ల మాస్టారే కాబ‌ట్టి. అయితే ఇప్పుడు ఈ బిరుదు తీసుకోడానికి హృతిక్ రోష‌న్ సై అంటున్నాడు. ఈయ‌న ఇప్పుడు లెక్క‌ల మాస్టారుగా మార‌బోతున్నాడు. అవును.. నిజ‌మైన లెక్క‌ల మాస్టారుగా. ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేక ఇబ్బంది ప‌డుతున్నాడు హృతిక్ రోష‌న్. ఒక్క సినిమా కూడా ఈ హీరో ఆశ‌లు నిల‌బెట్ట‌డం లేదు. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన కాబిల్ కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. చ‌రిత్ర సృష్టిస్తుంద‌నుకున్న మొహింజ‌దారో చ‌రిత్ర‌లోనే క‌లిసిపోయింది. ఇలాంటి టైమ్ లో ఈయ‌న ఇప్పుడు సూప‌ర్ 30 సినిమాలో న‌టిస్తున్నాడు.

ఈ సినిమా ప్ర‌ముఖ విద్యావేత్త ఆనంద్ కుమార్ బ‌యోపిక్. ఈయ‌న ప్ర‌తీ ఏడాది ఉచితంగా పేద విధ్యార్థుల‌కు ఐఐటి కోచింగ్ ఇస్తుంటాడు. ఇప్ప‌టికే ఎన్నో వంద‌ల మంది విద్యార్థుల‌ను ఐఐటి నిపుణులుగా తీర్చిదిద్ది త‌న‌వంతు కృషి చేసాడు ఆనంద్ కుమార్. ఇలాంటి వ్య‌క్తి జీవితాన్ని స్పూర్థిగా తీసుకుని సూప‌ర్ 30 సినిమా తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు వికాస్ బాల్. క్వీన్ సినిమాతో ఈయ‌న పాపుల‌ర్ అయ్యాడు. సూప‌ర్ 30 రెగ్యుల‌ర్ షూటింగ్ వార‌ణాసిలో మొద‌లైంది. అస‌లే బాలీవుడ్ లో బ‌యోపిక్ లు అంటే పిచ్చి. ప‌క్క‌వాడి జీవితం గురించి తెలుసుకోడానికి అక్క‌డి ప్రేక్ష‌కులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మ‌రి ఇప్పుడు హృతిక్ కూడా ఆనంద్ కుమార్ జీవితంతో విజ‌యం అందుకుంటాడా లేదా అనేది చూడాలిక‌..!

User Comments