ఎన్టీఆర్ బిగ్ బాస్.. మళ్ళీ చిక్కుల్లో పడిందే!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాదాలకు నిలయమైన బిగ్ బాస్ రియాలిటీ షో ను సక్సెస్ ఫుల్ గానే నడిపిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్ హిట్ అయిన ఈ షో తమిళం దగ్గరకు వచ్చేసరికి కొంచెం పెద్ద వివాదాలే చెలరేగగా.. ప్రస్తుతానికి అక్కడ కూడా బాగానే ముందుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, తెలుగులో ఎన్టీఆర్ పుణ్యమా అని ఈ షో అనుకున్న దానికంటే బాగానే సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో ఓ విషయమై బ్రాహ్మణ సంఘాల అభ్యంతరాలతో చిన్న వివాదం ఒకటి చెలరేగినా.. తర్వాత అది సద్దుమణిగినట్లే కనిపించింది. అనంతరం షో కూడా కొంచెం రసవత్తరంగా నడవడంతో టీఆర్పీలు కూడా బాగానే వచ్చాయని చెప్పుకున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఈ షో చిక్కుల్లో పడటం గమనార్హం. ఈ మేరకు హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త అచ్యుత రావు ఈ బిగ్ బాస్ షో పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా బిగ్ బాస్ షో పై తనకున్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ హెచ్ఆర్సి లో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ సందర్బంగా ఆయన తన పిటిషన్ లో.. బిగ్ బాస్ షో లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అమానుషమైన పనులు చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు పేర్కొనడమే కాకుండా షో లో టాస్క్ లపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా షో లో పనిష్మెంట్ పేరిట మూతులకు ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్ లో 50 సార్లు మునిగి లేవడం, సంచి నిండా ఉల్లిపాయలు తెచ్చి కోయమనడం, రాత్రి సమయాల్లో గార్డెన్ లో పడుకోవటం వంటి అమానవీయ చర్యలకు బిగ్ బాస్ యాజమాన్యం పాల్పడుతోందని ఆయన పిటిషన్ లో వివరించినట్లు సమాచారం. చివరగా షో లో జరుగుతున్నదంతా పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని, అది యువతను పెడదారి పట్టించేదేనని తెలియజేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ పిటిషన్ ను హెచ్ఆర్సి విచారణకు స్వీకరిస్తే బిగ్ బాస్ యాజమాన్యానికి నోటీసులు పంపే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది నిజంగానే బిగ్ బాస్ ను చిక్కుల్లో పడేస్తుందో లేదో చూడాలి.