డ్రగ్స్ కేసు.. సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు

Hyderabad drug racket VVIPs second third list

టాలీవుడ్ ను ప్రస్తుతం డ్రగ్స్ కేసు కుదిపేస్తుంటే.. ఇప్పుడు గంటకో కొత్త అప్డేట్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే 12 మంది, 15 మంది అంటూ టాప్ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చి నానా రచ్చ జరుగుతుంటే.. ఇప్పుడు వాళ్ళను మించిన బాబుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. అది కూడా సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు అంటూ టాక్ వినిపిస్తుండటం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే, పోలీసులు ఓ రేంజ్ లో విచారణ చేస్తుండటంతో డ్రగ్ డీలర్ కెల్విన్ తాజాగా మరో బాంబు పేల్చాడట. తన దగ్గర మత్తు మందులు కొంటున్న మరో కొంతమంది ప్రముఖుల పేర్లు బయటపెట్టాడట.

వీరిలో సినీ కెరీర్ ను చిన్నపాటి వేషాలతో ప్రారంభించి ఒకేసారి పెద్ద సినిమాలు తీసి బడా నిర్మాతగా మారిన ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నలుగురు చిన్నా చితకా నటుల పేర్లు కూడా ఈ తాజా లిస్టులో ఉన్నట్లు సమాచారం. ఇది కాకుండా ఇప్పుడు కెల్విన్ చెప్పిన మొత్తం వివరాలతో పాటు దర్యాప్తులో దొరికిన ఆధారాలతో కూడా కలుపుకుని సిట్ థర్డ్ లిస్టు కూడా ప్రిపేర్ చేస్తుందని తెలియడం విశేషం. ఇందులో గత నాలుగైదేళ్లుగా రాణిస్తున్న కొంతమంది యంగ్ హీరోయిన్స్ పేర్లు, పలువురు రాజకీయ నాయకుల తనయులు, హై ప్రొఫైల్ ప్రముఖులు, పేజ్ త్రీ సెలబ్రిటీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు కెల్విన్ తో పాటు అతని డ్రగ్స్ వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నట్లు చెబుతున్న అబ్దుల్ వాహీద్, అబ్దుల్ ఖుద్దూస్ లను కూడా సిట్ అధికారులు కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించారట. దీంతో ఇప్పుడు మొత్తంగా కొంతమంది పేర్లు బయటకు వచ్చాయని అంటున్నారు. వారి పేర్లనే త్వరలో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ గా బయట పెడతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఎవరి పేరు ఏ లిస్టులో ఉంటుందో, ఎవరు ముందు దొరికిపోతారో, ఎవరు పలుకుబడితో తప్పించుకుంటారో తెలియడం లేదు. మరోవైపు, ఇదే లిస్టులో ఉండి ఓ పబ్ లో వాటా కూడా కలిగి, డీలర్లకు కస్టమర్లకు మధ్య ఏజెంట్ లా వ్యవహరిస్తున్నాడని అనుమానాలు ఉన్న మరో మాజీ హీరోకి కూడా నోటీసులు జారీ అయి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చని టాక్ బయటకు రావడం ఇన్నర్ సర్కిల్ తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.