ఇద్ద‌రి లోకం ఒక‌టే మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  రాజ్ త‌రుణ్, షాలిని పాండే త‌దిత‌రులు
రిలీజ్ తేదీ: 25 డిసెంబ‌ర్ 2019
మ్యూజిక్: మిక్కీ.జె.మేయ‌ర్
బ్యాన‌ర్: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్
నిర్మాత‌: దిల్ రాజు
ద‌ర్శ‌క‌త్వం: కృష్ణారెడ్డి

ముందు మాట‌:
సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా గుర్తున్నాడు రాజ్ తరుణ్. వరుస విజయాలతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన ప్ర‌తిభావంతుడే అయినా దానిని క్యాష్ చేసుకోవ‌డంలో ఎందుక‌నో త‌డ‌బ‌డ్డాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు పరాజయాలతో పూర్తిగా కింద‌ పడిపోయాడు. ఎంత త్వరగా క్రేజ్ తెచ్చుకున్నాడో అంతే త్వరగా పోగొట్టుకున్నాడు. వరుసగా ఫ్లాప్ సినిమాలు చేస్తూ పోవడంతో.. ఇప్పుడు ఈ కుర్ర హీరోను మరిచిపోయే ద‌శ‌ వ‌చ్చేసింది. ఇలాంటి స‌మ‌యంలో దిల్ రాజు నిర్మించిన లవర్ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో రాజ్ తరుణ్ ని పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పుడు అసలు ఈయన సినిమాలు చేస్తున్నాడా లేదా అనే సందిగ్ధ‌త న‌డుమ‌ దిల్ రాజు నుంచే మరో అవకాశం వచ్చింది. ఎక్కడో రాజ్ తరుణ్ నక్క తోక తొక్కాడా అంటూ చ‌ర్చా సాగింది. `ఆడు మగాడ్రా బుజ్జి`  ఫేం కృష్ణారెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ బుధ‌వారం సినిమా క్రిస్మ‌స్ కానుక‌గా థియేట‌ర్ల‌లోకి రిలీజైంది. అయితే ఈ సినిమాతో రాజ్ త‌రుణ్ కంబ్యాక్ అయ్యాడా?  మూవీలో ద‌మ్మెంత అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థాక‌మామీషు:
ఒకే రోజు పుట్టి .. ఒకే చోట పెరిగిన బాల్య‌ స్నేహితులు రాజ్ త‌రుణ్ – షాలిని పాండే .. పాతికేళ్ల త‌ర్వాత క‌లుసుకుంటారు.. అటుపై ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సాగిన ప్ర‌ణ‌యం ఎలాంటిది? అన్న‌దే ఈ సినిమా. వేరొక యువ‌కుడితో ప్రేమ‌లో ప‌డిన షాలిని తిరిగి త‌న బాల్య స్నేహితుడు ప‌రిచ‌యం అయ్యాక ఎలాంటి డైల‌మాలో ప‌డిపోయింది? మ‌న‌సుల మ‌ధ్య దోబూచులాట ఎలా సాగింది? ఇక ఈ క‌థ‌లో ఊహించ‌ని ట్విస్టులేమిటి? అన్న‌ది బ్యాలెన్స్ సినిమా.

రాజ్ త‌రుణ్ ఫోటోగ్ర‌ఫీ ప్రేమికుడు. షాలిని క‌థానాయిక కావాల‌ని క‌ల‌లు క‌నే ఓ డ్రీమ‌ర్. అయితే త‌న క‌ల‌ల్ని మెచ్చ‌ని ప్రేమికుడి నుంచి దూర‌మై తిరిగి స్నేహితుడితో ప్రేమ‌లో ప‌డ‌డం అన్న థీమ్ ని ఎలివేట్ చేశారు. బాల్యంలో జ్ఞాప‌కాల్ని గుర్తు చేసుకోవ‌డం అనే మై ఆటోగ్రాఫ్ మూవ్ మెంట్స్ సినిమా అంతా ర‌న్ అవుతాయి. అయితే ఈ మొత్తం క‌థ‌ని చూపించిన విధాన‌మే మ‌రీ ఓల్డ్ క్లాసిక్ స్టైల్లో సాగుతుంది. ఒక ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఇవ్వాల్సిన చోట అంతా మిస్ ఫైర్ అయ్యింది.

ఇక ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా మ‌రీ ఇన్ని పాట‌లా? అని బోర్ ఫీల‌య్యేలా ద‌ర్శ‌కుడు రాసుకున్న స్క్రీన ప్లే పేల‌వంగా త‌యారైంది. ఇక రాజ్ త‌రుణ్ – షాలిని ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌య్యే క్ర‌మం .. ల‌వ్  స్టోరీ ఏమంత ఆక‌ట్టుకోవు. ఇక ఓల్డ్ స్కూల్ నెరేష‌న్ మ‌రీ బోర్ కొట్టిస్తుంది. షాలినికి మూవీ ఆఫ‌ర్ వ‌చ్చిన విధానం ఏమంత ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌దు. ప్ర‌తిసారీ పాట‌లు విసిగిస్తాయి. ఇక ఇంట‌ర్వెల్ ముందు ట్విస్ట్ ఎగ్జ‌యిట్ చేసినా.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సాఫీగా సాగే క‌థ‌నంతో బోర్ కొట్టేస్తుంది. ఇక ఫ‌స్టాఫ్ టోట‌ల్ గా ఫ్లాట్ గా సాగుతుంది. సెకండాఫ్ లోనూ అదే పంథాలో సినిమా బోర్ కొట్టిస్తుంది. ఇందులో ఎక్క‌డా కామెడీ అన్న‌ది మ‌చ్చుకు అయినా క‌నిపించ‌దు. పైగా రొమాన్స్ కూడా వ‌ర్క‌వుట్ కాదు. అస్స‌లు సినిమాలో ఎక్క‌డా ఫీల్ అన్న‌దే లేక‌పోవడంతో థియేట‌ర్ లో కూచోవ‌డం బ‌ల‌వంత‌మే అవుతుంది. మొత్తానికి రాజ్ త‌రుణ్ కెరీర్ లో మ‌రో చెత్త సినిమా ఇద‌ని తేలిపోయింది. సెకండాఫ్ లో ఊటీ అందాలు ఆక‌ట్టుకున్నా.. నేరేష‌న్ వైఫ‌ల్యం వ‌ల్ల అంతా నిష్ప్ర‌యోజ‌మే అయ్యింది.

న‌టీన‌టులు:
రాజ్ త‌రుణ్ ఈ చిత్రంలో ప‌రిణ‌తి చెందిన ప్రేమికుడిగా బాగానే మెప్పించాడు. షాలిని అంద‌చందాలు ఆక‌ట్టుకున్నాయి. షాలిని బోయ్ ఫ్రెండ్ పాత్రలో రాహుల్ ఓకే. అయితే ఓల్డ్ స్కూల్ నేరేషన్ అన్న‌దే ఈ సినిమాకి ప్ర‌ధానంగా మైన‌స్.  ప‌రిమిత క్యారెక్ట‌ర్లు.. ప‌రిమిత బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రంలో చెప్పుకోవ‌డానికేం లేదు.

టెక్నీషియ‌న్లు:
లిమిటెడ్ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకి అన్నీ మైన‌స్‌లే. ద‌ర్శ‌క‌త్వం ఫెయిల్. రొటీన్ ఓల్డ్ స్కూల్ స్టోరీని ఎంచుకుని క‌థ‌నాన్ని అంతే నీర‌సంగా న‌డిపించారు. లెక్క‌కు మిక్కిలి పాట‌లు..  కామెడీ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్. మిక్కీ.జె అందించిన రెండు ట్యూన్లు బావున్నా. మిగ‌తా అంతా సోసోనే.

ప్ల‌స్ పాయింట్స్:
* రాజ్ త‌రుణ్ న‌ట‌న‌, ఊటీ లొకేష‌న్
* షాలిని అందం.. అప్పియ‌రెన్స్

మైన‌స్ పాయింట్స్:
* ఎంచుకున్న ఓల్డ్ స్కూల్ స్టోరి, నేరేష‌న్
* కామెడీ లేక‌పోవ‌డం

ముగింపు:
ఇద్ద‌రిలోకమే కాదు రేటింగ్ కూడా ఒక‌టే!

రేటింగ్:
1/5