ఇంటిలిజెంట్ రివ్యూ

రివ్యూ: ఇంటిలిజెంట్

న‌టీన‌టులు: సాయిధ‌రంతేజ్, లావ‌ణ్య త్రిపాఠి, నాజ‌ర్, రాహుల్ దేవ్ త‌దిత‌రులు
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్

క‌థ‌: ఆకుల శివ‌

క‌థ‌నం, ద‌ర్శ‌కుడు: వివి వినాయ‌క్

చావో రేవో తేల్చుకోవాల్సిన ప‌రిస్థితుల్లో ఉన్నాడు సాయిధ‌రంతేజ్. అలాంటి స‌మ‌యంలో వినాయ‌క్ ఆయ‌న‌కు తోడ‌య్యాడు. మ‌రి ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పించింది..?

క‌థ‌: 
తేజ‌(సాయిధ‌రంతేజ్) సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్. చిన్న‌ప్ప‌ట్నుంచీ సాటి వాళ్ల‌కు సాయం చేస్తుంటాడు. అత‌డి గాడ్ ఫాద‌ర్(నాజ‌ర్) అలాగే నేర్పిస్తాడు. ఆయ‌నే జీవితంగా బ‌తికేస్తూ.. అత‌డి ఆఫీస్ లోనే ప‌ని చేస్తుంటాడు తేజ‌. అలాంటి టైమ్ లో తేజ గాడ్ ఫాద‌ర్ జీవితంలోకి విక్కీభాయ్ (రాహుల్ దేవ్) వ‌స్తాడు. తేజ ప‌నిచేసే కంపెనీని త‌మ‌కు రాసివ్వాలంటూ అత‌డి బాస్ (నాజ‌ర్) ను భ‌య‌పెడ‌తారు. అనుకోని ప‌రిస్థితుల్లో కంపెనీ మాఫియా వాళ్ల పేరున రాసి తాను చ‌నిపోతాడు తేజ బాస్. త‌న బాస్ ఎలా చ‌నిపోయాడు.. ఎందుకు చ‌నిపోయాడు.. తేజ ధ‌ర్మాభాయ్ గా ఎందుకు మారాడు..? అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం: 
మాస్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ వినాయ‌క్. ఆయ‌న సినిమా వ‌స్తుందంటే చాలు ప్రేక్ష‌కులు ఊహించేది కూడా అదే. ప్ర‌తీ సినిమాలోనూ అదే చేస్తాడు ఈ ద‌ర్శ‌కుడు. రొటీన్ క‌థ‌ల‌తోనే మాయ చేస్తుంటాడు వినాయ‌క్. కానీ ఈ సారి అది కూడా కుద‌ర్లేదు. టైటిల్ లో క‌నిపించిన ఇంటిలిజెన్స్ సినిమాలో క‌నిపించ‌లేదు. హీరో తెలివైనోడు అని చూపించే క్ర‌మంలో క‌థ‌పై దృష్టి పెట్ట‌లేదు వినాయ‌క్. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ నుంచి రొటీన్ మూస‌లోనే సాగిపోయింది క‌థ‌. ఫ‌స్ట్ సీన్ లోనే ఫైట్.. ఆ త‌ర్వాత హీరోయిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్.. ఆమెతో కాసేపు ప్రేమ సీన్స్.. ఇలా మూస‌లో వెళ్లిపోయాడు వినాయ‌క్. మ‌ధ్య‌లో చిరు సీన్స్ కూడా కొన్ని వాడేసాడు. ముఖ్యంగా ఘ‌రానా మొగుడులో బాస్, ఎంప్లాయ్ మ‌ధ్య సీన్స్ గుర్తు చేసాడు వినాయ‌క్. ఇక ఠాగూర్ సినిమాలోని బూతులు మింగేసా లాంటి సీన్స్ కూడా కాపీ కొట్టేసాడు. ఇన్ని చేసినా కూడా క‌థ‌పై ఆస‌క్తి మాత్రం పెంచ‌లేక‌పోయాడు వినాయ‌క్. చాలాచోట్ల జ‌రిగే సీన్స్ కు లాజిక్ ఉండ‌దు. ఓ క‌లెక్టర్ ఇంటికి వ‌చ్చి రౌడీ కాల్చేసి వెళ్తాడు.. పైగా వ‌చ్చి కాసేపు గ‌న్ ను ముద్దు పెట్టుకుంటాడు. ఆ సీన్ ఆంత‌ర్యం ఏంటో.. అది అంత బాగా ఎలా డిజైన్ చేసాడో వినాయ‌క్ కే తెలియాలి. ఇలాంటి సీన్స్ ఇంటిలిజెంట్ లో చాలా ఉన్నాయి. నాయ‌క్ ను త‌ల‌పించే సీన్స్ అన్నీ రిపీట్ అవుతుంటాయి. అక్క‌డ నాయ‌క్ భాయ్ పేరు చెప్పి భ‌య‌పెట్టిన‌ట్లు ఇక్క‌డ ధ‌ర్మాభాయ్ పేరు చెప్తారంతే. చివ‌రివ‌ర‌కు కూడా ఆస‌క్తి లేని క‌థ‌నంతో విసుగు పుట్టించాడు వినాయ‌క్.

న‌టీన‌టులు: 
సాయిధ‌రంతేజ్ మ‌రోసారి ఈజ్ ఉన్న పాత్ర‌లో న‌టించాడు. త‌న న‌ట‌న‌కు పేరు పెట్ట‌లేం కానీ ఇలాంటి పాత్ర‌ల్లోనే ఫిక్స్ అయిపోతే మాత్రం సాయికి క‌ష్టాలు త‌ప్ప‌వు. లావ‌ణ్య త్రిపాఠి ప‌ర్ ఫెక్ట్ తెలుగు సినిమా హీరోయిన్ పాత్ర‌లో న‌టించింది. అంటే పాట‌ల‌కు త‌ప్ప క‌థ‌కు ప‌నికిరాని పాత్ర అన్న‌మాట‌. సాయిధ‌రంతేజ్ గాడ్ ఫాద‌ర్ గా నాజ‌ర్ బాగా న‌టించాడు. రాహుల్ దేవ్, కాశీ విశ్వ‌నాథ్ వీళ్లంతా పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్లు బాగానే చేసారు.

టెక్నిక‌ల్ టీం:

థ‌మ‌న్ మ్యూజిక్ ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే ఒక్క పాట కూడా ఆక‌ట్టుకోలేదు. ఛ‌మ‌క్ ఛ‌మ‌క్ పాట‌ను మాత్రం పెద్ద‌గా మార్చ‌కుండా అలాగే పెట్టేసాడు థ‌మ‌న్. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆక‌ట్టుకోలేదు. ఇక పాట‌ల్లో లిరిక్స్ వినిపించ‌డ‌మే క‌ష్ట‌మైపోయింది. విశ్వేశ్వ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఛ‌మక్ ఛ‌మ‌క్ పాట విజువ‌ల్ గా బాగా తీసాడు. ఇక శేఖ‌ర్, జానీ మాస్ట‌ర్స్ కొరియోగ్ర‌ఫీ బాగుంది. సాయితో డాన్సులు ఫుల్ గా వేయించారు. క‌థ ర‌చ‌యిత‌గా ఆకుల శివ అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్ప‌టికే వాడేసిన క‌థ‌ను మ‌ళ్లీ ఇచ్చాడు. ద‌ర్శ‌కుడిగా వినాయ‌క్ ఇంతగా ఎప్పుడూ నిరాశ ప‌ర‌చ‌లేదు. అఖిల్ త‌ర్వాత అంత నిరాశ‌పరిచిన సినిమా ఇదే.

చివ‌ర‌గా: 
ఇంటిలిజెంట్.. టైటిల్ కు మాత్ర‌మే ప‌రిమితం..

రేటింగ్: 2.25/5

User Comments