ఇంట‌ర్ ఆత్మ‌హ‌త్య‌లు వెండితెర‌పైకి!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని కుదిపేసిన‌ ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. జాతీయ స్థాయిలో డిబేట్ కి వ‌చ్చిన అంశ‌మిది. కేసీఆర్ ప్ర‌భుత్వానికి బ్యాడ్ నేమ్ తెచ్చిన ఈ వ్య‌వ‌హారంపై సినిమా తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇందులో యాంగ్రీ మేన్ రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నారు. ఆంధ్రా పోరి ఫేం రాజ్ మాదిరాజు ఈ క‌థను రాసుకుని ఓకే చేయించుకున్నార‌ట‌.

ఇంట‌ర్ కి సంబంధించి త‌ప్పుడు ఫ‌లితాలు వెలువ‌డ‌డంతో అది కాస్తా విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారి తీసింది. అధికారుల త‌ప్పిదానికి మెరిట్ విద్యార్థులు అన్యాయంగా బ‌లైపోయారు. ఈ ఘ‌ట‌న ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఓవైపు త‌ల్లిదండ్రులు స‌హా ప్ర‌తిప‌క్ష విప‌క్షాలు కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని దుమ్మెత్తిపోసాయి. అందుకే ఈ ఘ‌ట‌నకు  చాలా ప్రాధాన్య‌త ఉంది. ఇలాంటి వివాదాస్పద అంశాన్ని ఎంచుకుని ఇందులో న‌టించేందుకు ప్ర‌య‌త్నించ‌డం అంటే సాహ‌స‌మే. ప్ర‌స్తుతం ఇంట‌ర్ విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల ఘ‌ట‌న‌ల‌పై కోర్టు కేసులు న‌డుస్తున్నాయి. దీనిపై ఓ క‌మిటీ సీరియ‌స్ గా ద‌ర్యాప్తు చేస్తోంది. ఇలాంటి వేళ ఈ క‌థ‌ను ఎంచుకుని అందులో లాయ‌ర్ గా రాజ‌శేఖ‌ర్ న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం అవుతుండ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.